నూతన సంవత్సరం గొప్ప వరం
వివేకం
జీవితంలో నూతన ఆకాంక్షలకు తెర తీయడానికి ఈ నూతన సంవత్సరం గొప్ప వరం. మన చుట్టూ ప్రపంచాన్ని పరికిస్తే అది అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మనకు అందుబాటులోకి వచ్చిన ఎన్నో సౌకర్యాలతో ఆనందించాల్సింది పోయి, తనకూ ఇంకా ఇతరులకూ మనిషి కలిగించే కష్టనష్టాలకు అంతే లేదని చెప్పాలి.
ఈనాటి వాస్తవం ఇదే. ఎక్కడా స్పష్టత అనేదే లేదు. నిజానికి తమకు ఏమి కావాలో కూడా తెలియకుండానే, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండానే, ఈ ప్రపంచంలోని చాలామంది జీవితాలు గడిపేస్తున్నారు.
ఎప్పుడైనా మన అనుభవాల ఆధారంగానే మనం ముందుకు వెళితే, అది కేవలం సాధారణ విషయాలకే పరిమితమౌతుంది. అలా చేస్తే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగానే జీవితాల్ని మలచుకొంటూ ఉంటాం. కాని రేపు మనం పోదామనుకుంటున్న దానికీ, ప్రస్తుతం మనం ఉన్నదానికీ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. జీవితంలో ఏది ఉత్కృష్టమైనదిగా మనం కోరుకుంటున్నామో దానికీ, మన ప్రస్తుత పరిస్థితికీ సంబంధం ఉండనక్కరలేదు.
మన దృక్కోణాన్ని ప్రస్తుత పరిస్థితులకు పరిమితం చేసివేసినట్టయితే, సాధించడానికి వీలైన, సులభమైనదానితోనే మళ్లీ మనం రాజీపడిపోతున్నామని అర్థం.తనకూ, చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా అత్యున్నతమైనదాన్ని సాధించాలని ఎవరైనా దృష్టి కేంద్రీకరిస్తే, అది సృష్టించడం మనిషి సామర్ధ్యానికి అతీతమైనదేమీ కాదు. ఎవరి దృక్కోణం చాలా స్పష్టంగా ఉంటుందో, దాన్ని సాకారం చేసుకోవడం కోసం తన జీవితంలోని ప్రతిక్షణమూ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి వారి పాదాల చెంతకు ఆ అత్యున్నతమైనది వచ్చి వాలుతుంది. మనకంటూ ఓ స్పష్టమైన యోచన ఉంటే, చేసే పని ఫలితం గురించిన ఆందోళన మనకు లేదని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... మనకు ఓ ఆలోచన ఉంది. మన జీవితాన్ని దానికి అంకితం చేసేశాం. అంతే. నిజానికి అత్యున్నతమైనదాన్ని సాధించడానికి గల అతి సులభమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఇదే ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ. భగవద్గీత యావత్తూ దీని గురించే చెబుతోంది. ‘అది జరుగుతుందా? లేదా?’ అనేదానిని పట్టించుకోకుండా నీవేమి కావాలనుకొంటున్నావో దానికి అంకితమైపో!’ అని.
మన ఆలోచనలో ‘అత్యున్నతమైనది’ అనుకున్న దానికోసం, ఏకాగ్ర చిత్తంతో దాని సాధనకు పూనుకోవలసిన సమయమిది. ఈ జీవితానికీ, దీనికి అతీతమైనదానికీ గల జీవన జ్ఞానాన్ని పొందడానికి ఇదో అతి సులభమైన మార్గం. ఇటువంటి సుస్పష్టమైన దృష్టి గలవాడే నిజంగా ధన్యుడు. అతీతాన్ని కూడా అవలోకనం చేయగల శక్తిని ఈ నూతన సంవత్సరం మీకందరకూ అందించుగాక!
సమస్య - పరిష్కారం
ఈ నూతన సంవత్సరంలో ఆలోచనా విధానాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కోరుకున్న రీతిగా ఆలోచనలను ఎలా తెచ్చుకోగలను?
- పి.ప్రసాద్‌బాబు, విజయవాడ
సద్గురు: అంతా మీ దృక్కోణం మీదే ఆధారపడి ఉంది. ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నవి అని ఆలోచించడం కన్నా, విశాలమైన జీవిత దృక్కోణంతో ఆలోచించడం మంచిది. అసలు మనని మనం ఒక అత్యల్పమైన ధూళి కణంగా భావించి, గమనించాల్సి ఉంటుంది. ఈ విశ్వంతో పోలిస్తే, మనం ఎంతో విశాలమైనదిగా భావిస్తున్న మన పాలపుంత అత్యంత అల్పమైనది. అది చాలా చాలా చిన్నది. ఇక మన పాలపుంతలో మన సౌరకుటుంబం కూడా చాలా చిన్నది. ఈ సౌరకుటుంబంలో మన భూగోళం ఇంకా చాలా చిన్నది. ఇందులో మన ఊరు ఒక చిన్న భాగం.
ఈ అతి చిన్నభాగంలో మనమో... చాలా పేద్ద మనుషులం... అనుకుంటున్నాం కదా! అసలు తామెవరు? ఏమిటి? అనే విషయాన్ని మనుషులు మరచి ప్రవర్తిస్తున్నారు. కనీసపు తెలివితోనైనా ఈ ఉనికిలో మన స్థానమేమిటో తెలుసుకోగలగాలి. ఇదే అతి ముఖ్యమైన విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే మరో సరికొత్త లోకం ఆవిష్కారమవుతుంది. అంటే అప్పటినుంచి మన నడక మారిపోతుంది. ఆలోచించడం, కూర్చోడం, నుంచోవడం, తినడం... సర్వం మారిపోతాయి. అంటే మనం జీవితాన్ని అనుభవించే తీరే పూర్తిగా మారిపోతుంది.