ఆ నోట్లు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!
ముంబై: దేశంలో నకిలీ కరెన్సీ చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.500, రూ.1,000 నోట్లను స్వీకరించేటపుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంలో ఈ నోట్లలో నకిలీలు పెరుగుతున్నందున, వాటిని స్వీకరించడంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆర్బీఐ సూచించింది. "జాగ్రత్తగా పరిశీలించిన" తరవాతే ఆ నోట్లు తీసుకోవాలని కోరింది.
రోజువారీ లావాదేవీల్లో నకిలీనోట్లను ప్రవేశపెట్టేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆర్బీఐ వివరించింది. నకిలీ కరెన్సీ చలామణి దారులు హయ్యర్ డినామినేషన్ లో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని తెలిపింది. కొంచెం నిశితంగా పరిశీలిస్తే నకిలీ నోట్లను గమనించడం చాలా సులువనీ, దీనికి సంబంధించిన వివరాలను ఆర్బీఐ వెబ్సైట్లో అందుబాటులో వున్నాయని పేర్కొంది. వెబ్సైట్లో పొందపర్చిన నోట్లపై ఉండే భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని కోరింది.
నకిలీ నోట్లను కలిగి ఉండడం, మార్పిడి, అంగీకారం, నకిలీ నోట్లను చెలామణి చేయడం, అలాంటి సహకరించిన వారికి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కఠినమైన శిక్షలు తీసుకుంటాయని హెచ్చరించింది. నకిలీ నోట్ల చలామణిని గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే పెద్ద సంఖ్యలో భారతీయ నోట్ల ఉపయోగం కోసం అదనపు గుర్తింపు అవసరాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది.