డిప్యూటీ స్పీకర్ వివక్ష: జానా
సాక్షి, హైదరాబాద్: ‘సభలో సంయమనం పాటిస్తూ అర్థవంతమైన చర్చ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. విపక్ష సభ్యులు మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మంత్రులు మధ్య మధ్య అడ్డుతగులుతున్నారు. అధికారపక్షానికి అత్యధిక సమయం ఇస్తూ, ప్రతిపక్ష సభ్యులను పట్టించుకోవడం లేదు. పాలకపక్షం, విపక్షాల నడుమ మధ్యవర్తిగా ఉండాల్సిన చైర్ ఆ పనిచేయడం లేదు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పూర్తి వివక్ష చూపిస్తున్నారు..’ అని సీఎల్పీ నేత కె.జానారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
బుధవారం శాసనసభలో సంక్షేమ అంశాలపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతుండగా పదేపదే మంత్రులు అడ్డుపడడం, మధ్యలో టీఆర్ఎస్కు చెందిన ఓ సభ్యునికి అవకాశం కల్పించడం, సంపత్‌కు అసలు మైక్ ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో కాంగ్రెస్ శాసనసభా పక్షం వాకౌట్ చేసింది.అనంతరం సీఎల్పీ నేతజానారెడ్డి ఎమ్మెల్యేలతో కలసి విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ తమను గుర్తించడం లేదని, విపక్ష సభ్యులకు మైక్ ఇవ్వడం లేదన్నారు.
సభావ్యవహారాలు పూర్తిగా అప్రజాస్వామికంగా ఉన్నాయని, వాకౌట్ చే స్తున్నామని విపక్ష నేత ప్రొటెస్ట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే భట్టివిక్రమార్క విమర్శించారు. మంత్రి హరీష్‌రావు స్క్రీన్‌ప్లేతో, ఆయన కనుసన్నల్లో సభా వ్యవహారాలు సాగుతున్నాయని ఆరోపించారు. సభను టీఆర్ఎస్ ఆఫీసులా భావిస్తున్నారని విరుచుకుపడ్డారు.