ఆలన లేని పాలన!
♦ సొంత వ్యవహారాలపైనే జిల్లా మంత్రులకు శ్రద్ధ
♦ ఇన్చార్జి మంత్రి తీరూ అలాగే ఉంటే ఎలా?
♦ గంటా, అయన్నలతోపాటు యనమలపై సీఎం ఆగ్రహం
♦ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగించుకోలేదని చివాట్లు
♦ మంత్రివర్గ సమావేశంలోనే ముగ్గురికీ తలంటు
‘సొంత వ్యవహారాలే తప్ప.. పాలనను పట్టించుకోరు.. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏం లాభం?.. వారు సరే.. మరి ఇన్చార్జి మంత్రి ఏం చేస్తున్నట్లు??.. ఒక్కసారైనా జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారా!.. ఎమ్మెల్యేల కష్టసుఖాలు తెలుసుకున్నారా!!.. ఇలా అయితే కష్టం. తీరు మార్చుకోకపోతే.. నా నిర్ణయం నేను తీసుకుంటాను’.. ఇదీ మంత్రులు గంటా, అయ్యన్న, యనమలలకు సీఎం చంద్రబాబు తలంటిన విధం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చోటుచేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశమైంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు. విశాఖ జిల్లా మంత్రులే కాదు ఇన్చార్జి మంత్రీ అలాగే ఉన్నారు. ఇలా అయితే కష్టం’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులతోపాటు ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజవాయడలో శనివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సీఎం ఇలా సూటిగా మొట్టికాయలు చేయడం విశేషం. ప్రధానంగా ఉపాధి హామీ పథకం అమలు తీరు సక్రమంగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు, ఇన్చార్జి మంత్రి యనమలను జిల్లా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అడ్డుకుంటున్న తీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకునే మంత్రివర్గ సమావేశంలో మంత్రులను సున్నితంగానైనా సూటిగా మందలించారు.
ఉపాధి హామీ అమలు ఇలాగేనా!
ఉపాధి హామీ పథకం నుంచి గరిష్ట ప్రయోజనం లభించేలా చూడటంలో మంత్రులు అయ్యన్న, గంటా, యనమల విఫలయమ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకంలో లేబర్, మెటీరియల్ కాంపోనెంట్లు 60 : 40 నిష్పత్తిలో ఉండొచ్చు. కానీ మెటీరియల్ కాంపోనెంట్ను అవకాశం ఉన్నంతవరకు ఉపయోగించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అంగన్వాడీ భవనాలు, సామాజిక భవనాలు, ఇతర పనులు చేపట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ మంత్రుల అశ్రద్ధ వల్ల సాధ్యం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రులు గంటా, అయ్యన్నలు జిల్లా పరిపాలనా వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సూటిగానే వ్యాఖ్యానించారు. ‘మీరిద్దరూ మీ సొంత వ్యవహారాలే చూసుకుంటున్నారు. పాలనను పట్టించుకోవడం లేదు. దాంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నా నిర్ణయం నేను తీసుకుంటాను’ అని స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇన్చార్జ్ మంత్రి ఏం చేస్తున్నట్లు!?
జిల్లా మంత్రులే కాదు.. ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు జిల్లాలో పాలనా వ్యవహారాలను ఇన్చార్జి మంత్రిగా ఎందుకు సమీక్షించ లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించారు. జిల్లా మంత్రులు ఎలాగూ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు.. ఇన్చార్జి మంత్రీ అలాగే ఉంటే ఎలా అని నిలదీశారు. మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు మంత్రులపై సీఎం ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.