గెస్ట్ హౌస్‌లో సీఎం డోర్ లాక్ చేయబోతే..!
త్రివేండ్రం: కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ బస చేసిన గెస్ట్ హౌస్‌లో డోర్ లాక్ రిపేరి చేయించనందుకు అసిస్టెంట్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేశారు. ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు విజయ్ బస చేశారు.
గెస్ట్ హౌస్‌లో విజయన్ బస చేసిన 107 గదికి డోర్ లాక్ చెడిపోయింది. మొదటి రోజు కేరళ సీఎం గది లోపల డోర్ లాక్ వేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అధికారులు ప్రయత్నించి చూసినా వీలుకాలేదు. ఆ మరుసటి రోజు సీఎం భద్రత సిబ్బంది ఈ విషయాన్ని గెస్ట్ హౌస్ మేనేజర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే కార్పెంటర్లను పిలిపించి డోర్ లాక్‌ను సరిచేయించారు. ఆ తర్వాత విజయన్ డోర్ లాక్ చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ పడలేదు. దీంతో ఆగ్రహం చెందిన సీఎం తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామన్యుల పరిస్థితి ఏంటని అధికారులపై మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేసిన అధికారులు, ఇందుకు బాధ్యుడిగా ప్రజాపనుల శాఖ ఏఈని సస్పెండ్ చేశారు. ఈ దెబ్బకు అలువా గెస్ట్ హౌస్‌లో అన్ని డోర్లను రిపేర్ చేయడమో లేక మార్చడేమో చేశారు.
ఇదిలావుండగా, ఇదే గెస్ట్ హౌస్‌లో రూమ్ నెంబర్ 107వ గదిలో గతంలో మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ బస చేసేవారు. ఇక్కడి నుంచే ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కాగా ఆయనెప్పుడూ గదిలోపల డోర్ లాక్ చేసుకోలేదట. అత్యంత భద్రత ఉండే ముఖ్యమంత్రికి డోర్ లాక్ చేసుకోవాల్సిన అవసరముందా అని అచ్యుతానందన్ వర్గీయలు ప్రశ్నించారు.