అధిష్టానం పిలుపుతో సీఎం ఢిల్లీ పయనం
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఆయన ఈ సాయంత్రం ఆంటోనీ కమిటీతో సమావేశమవుతారు. రాష్ట్రం విభజిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో ఉద్యమాలు ఉధృతం కావడంతో వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
సీమాంధ్రలో ఉద్యమాలు - 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ముందుకు తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన నేపధ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో పరిస్థితులను, సీమాంధ్ర ఉద్యమాల గురించి సీఎం ఆంటోనీ కమిటీకి వివరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేపు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కూడా కోరారు. ఆయన ప్రధాన మంత్రితోపాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలుస్తారని తెలుస్తోంది. యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ వైద్యం కోసం అమెరికా వెళ్లినందున ఆమెను కలిసే అవకాశం లేదు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధిష్టానం నేతలు, ఆంటోనీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితోపాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కూడా సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తోంది.