CM Narayan Swamy
-
మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్– డీఎంకేల అధికార కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి సర్కారుకు ఇద్దరు అధికార పక్ష ఎమ్మెల్యేల రాజీనామా రూపంలో మరో సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా, ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కే లక్ష్మి నారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను స్వయంగా స్పీకర్ వీపీ శివకొలుందుకు అందజేశారు. ఈ రాజీనామాలతో అధికార పక్షం బలం ఒక ఇండిపెండెంట్ సభ్యుడితో కలుపుకుని 12కి చేరింది. తమకు మద్దతిస్తున్న నామినేటెడ్ సభ్యులు ముగ్గురితో కలుపుకుని విపక్ష సభ్యుల సంఖ్య 14గా ఉంది. మొత్తం 33(ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కలుపుకుని) మంది సభ్యుల అసెంబ్లీలో ఏడు ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సీఎం నారాయణస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు నామినేటెడ్ సభ్యులకు ఉంటుందా? ఉండదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. నామినేటెడ్ సభ్యులకు బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు ఉండదని, అయినా, ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని ఇప్పటికే సీఎం నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని రాజీనామా అనంతరం లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేశానన్నారు. అయితే, వెంకటేశన్ మాత్రం తాను డీఎంకేలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయడం లేదని, దాంతో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని వివరించారు. ఇద్దరు మాజీ మంత్రులు నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యారు. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు
సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఒకే వేదిక మీదకు వచ్చారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి అధికారం చేపట్టినప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి పక్కలో బల్లెంలా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. గవర్నర్ కావాలనే తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. పలు సార్లు కిరణ్‌బేడీ పర్యటనలను కూడా అడ్డుకునే విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్ నిర్ణయాల్ని సీఎం వ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి. దీంతో వీరివురి సమస్యకు పరిష్కారం లేదా అనే సందేహం చాలమంది అధికారపార్టీ నేతల్లో ఉండేది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వేదిక ముఖ్యమంత్రి, గవర్నర్లు అందరిని ఆశ్చర్యపరుస్తూ, ఆకర్షించే రీతిలో కనిపించారు. ఇప్పటికైనా ఇరువురు తమ పంతాలను పక్కన పెట్టి సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమించాలని అటు ప్రజలు, ఇటు పార్టీల నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
తగ్గని కిరణ్
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఏ మాత్రం తగ్గడం లేదు. సీఎం నారాయణ స్వామి సర్కారును ఢీ కొట్టే విధంగా ముందుకు సాగుతున్నారు. పీఎఫ్ నిధిలో రూ.36 కోట్లను దారి మళ్లించి ఉండడాన్ని ప్రస్తుతం వెలుగులోకి తెచ్చారు. సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, సీఎం నారాయణ స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. గత వారం రోజులుగా కిరణ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పడ్డ అఖిల పక్షం తీవ్ర నినాదాల్ని అందుకుంది. ఆమెను బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వెనక్కు తీసుకోవాలన్న నినాదాలతో ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని వెల్లువెత్తించారు. ఈ వివాదాల నేపథ్యంలో శనివారం కిరణ్‌బేడీ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో రెండు రోజుల పాటుగా బేటీలతో బిజీ అయ్యారు. ఆ పెద్దల అండదండాలతో కూడిన భరోసా దక్కిందో ఏమోగానీ దూకుడు పెంచే పనిలో లెఫ్టినెంట్ గవర్నర్ నిమగ్నం కావడం గమనార్హం. నారాయణ స్వామి ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా సోమవారం ఆమె స్పందించారు. పీఎఫ్ నిధి దారి మళ్లించి ఉండడాన్ని పసిగట్టి, వెలుగులోకి తెచ్చారు. క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్ణయించడంతో పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. పీఎఫ్ దారి మళ్లింపు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకారం సంస్థల్లోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధిలో రూ.36 కోట్లను ఇతర పనులకు దారి మళ్లించినట్టు కిరణ్ గుర్తించారు. తన పరిశీలనలో వచ్చిన అంశాన్ని వెలుగులోకి తెస్తూ తొలుత ట్విట్టర్లో రూ.36 కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించడంతో నారాయణ స్వామి ప్రభుత్వ వర్గాలకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో మంత్రి కందస్వామి సమాధానం ఇస్తూ, ఇది తమ హయాంలో జరిగింది కాదని, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చి తమ మీద నిందలు వేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిద్ధమైనట్టున్నారని మీడియా ముందు విరుచుకు పడ్డారు. తాము గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దృష్ట్యా, తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, చెడ్డ పేరు తీసుకొచ్చే రీతిలో ఆమె చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. దీంతో కిరణ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని, అస్సలు ఆ నగదు దారి మళ్లింపు అన్నది క్రిమినల్ నేరంగా అభివర్ణిస్తూ, అందుకు తగ్గ చర్యలకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు గాను న్యాయ శాఖ అభిప్రాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించి, ఆ శాఖ కార్యదర్శికి ఓ లేఖ రాయడం గమనార్హం. అందులో పీఎఫ్ నిధి దారి మళ్లింపు అన్నది క్రిమినల్ చర్య కిందకు వస్తుందన్న విషయం తన పరిశీలనలో తేలిందని గుర్తు చేశారు. పీఎఫ్ దారి మళ్లింపు ఎలా జరిగింది, పీఎఫ్ నిధి విషయంలో ఏమి జరుగుతున్నదో, మంత్రి 11 నెలలుగా ఏమి చేశారో, సమగ్ర వివరాలతో పాటుగా క్రిమినల్ కేసు విషయంలో అభిప్రాయం తెలియజేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. అయితే, పీఎఫ్ దారి మళ్లింపు వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాన్ని స్వీకరించేందుకు కిరణ్ నిర్ణయించడం పుదుచ్చేరిలో సాగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.