తగ్గని కిరణ్
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఏ మాత్రం తగ్గడం లేదు. సీఎం నారాయణ స్వామి సర్కారును ఢీ కొట్టే విధంగా ముందుకు సాగుతున్నారు. పీఎఫ్ నిధిలో రూ.36 కోట్లను దారి మళ్లించి ఉండడాన్ని ప్రస్తుతం వెలుగులోకి తెచ్చారు.
సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, సీఎం నారాయణ స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. గత వారం రోజులుగా కిరణ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పడ్డ అఖిల పక్షం తీవ్ర నినాదాల్ని అందుకుంది. ఆమెను బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వెనక్కు తీసుకోవాలన్న నినాదాలతో ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని వెల్లువెత్తించారు. ఈ వివాదాల నేపథ్యంలో శనివారం కిరణ్‌బేడీ ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీ పెద్దలతో రెండు రోజుల పాటుగా బేటీలతో బిజీ అయ్యారు. ఆ పెద్దల అండదండాలతో కూడిన భరోసా దక్కిందో ఏమోగానీ దూకుడు పెంచే పనిలో లెఫ్టినెంట్ గవర్నర్ నిమగ్నం కావడం గమనార్హం. నారాయణ స్వామి ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా సోమవారం ఆమె స్పందించారు. పీఎఫ్ నిధి దారి మళ్లించి ఉండడాన్ని పసిగట్టి, వెలుగులోకి తెచ్చారు. క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్ణయించడంతో పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.
పీఎఫ్ దారి మళ్లింపు
ప్రభుత్వ రంగ సంస్థలు, సహకారం సంస్థల్లోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధిలో రూ.36 కోట్లను ఇతర పనులకు దారి మళ్లించినట్టు కిరణ్ గుర్తించారు. తన పరిశీలనలో వచ్చిన అంశాన్ని వెలుగులోకి తెస్తూ తొలుత ట్విట్టర్‌లో రూ.36 కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించడంతో నారాయణ స్వామి ప్రభుత్వ వర్గాలకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో మంత్రి కందస్వామి సమాధానం ఇస్తూ, ఇది తమ హయాంలో జరిగింది కాదని, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చి తమ మీద నిందలు వేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిద్ధమైనట్టున్నారని మీడియా ముందు విరుచుకు పడ్డారు.
తాము గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దృష్ట్యా, తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, చెడ్డ పేరు తీసుకొచ్చే రీతిలో ఆమె చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. దీంతో కిరణ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని, అస్సలు ఆ నగదు దారి మళ్లింపు అన్నది క్రిమినల్ నేరంగా అభివర్ణిస్తూ, అందుకు తగ్గ చర్యలకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు గాను న్యాయ శాఖ అభిప్రాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించి, ఆ శాఖ కార్యదర్శికి ఓ లేఖ రాయడం గమనార్హం.
అందులో పీఎఫ్ నిధి దారి మళ్లింపు అన్నది క్రిమినల్ చర్య కిందకు వస్తుందన్న విషయం తన పరిశీలనలో తేలిందని గుర్తు చేశారు. పీఎఫ్ దారి మళ్లింపు ఎలా జరిగింది, పీఎఫ్ నిధి విషయంలో ఏమి జరుగుతున్నదో, మంత్రి 11 నెలలుగా ఏమి చేశారో, సమగ్ర వివరాలతో పాటుగా క్రిమినల్ కేసు విషయంలో అభిప్రాయం తెలియజేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. అయితే, పీఎఫ్ దారి మళ్లింపు వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాన్ని స్వీకరించేందుకు కిరణ్ నిర్ణయించడం పుదుచ్చేరిలో సాగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.