చంద్రబాబుకు తమిళనాడు సీఎం లేఖ..
ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం మంత్రులు, డీజీపీతో మంగళవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఉద్రిక్తతకు ఆస్కారమున్న వేలూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూరు, విల్లుపురం, సేలం జిల్లాల్లో, ఏపీ సరిహద్దులో బందోబస్తును పటిష్టం చేయాలన్నారు. దీనిపై ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖరాస్తూ.. కాల్పులకు పాల్పడకుండా అరెస్ట్ చేసి ఉండవచ్చన్నారు. దీనిలో మానవహక్కుల ఉల్లంఘన జరిగినట్లుగా భావిస్తున్నామన్నారు.
ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులోని అన్ని పార్టీల నేతలు మండిపడ్డారు. ఏపీ, తమిళనాడు మధ్య నెలకొన్న సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి పరిష్కరించుకోని ఫలితంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారని డీఎంకే అధినేత కరుణానిధి అన్నారు. ఏపీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. ఏపీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని ఎండీఎంకే అధినేత వైగో ఆరోపించారు.