‘సీఎం సీమాంధ్ర జేఏసీ చైర్మన్’
కమ్మర్పల్లి, న్యూస్‌లైన్ :రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ, తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి వి.ప్రభాకర్ ఆరోపించారు. జిల్లాకు రూ.60 నుంచి రూ.70 లక్షలు ఇస్తూ సమైక్యవాదులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రులు చేస్తున్నది కత్రిమ, కిరాయి ఉద్యమమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదని, ప్రత్యేకరాష్ట్రం కోసం ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారో సీమాంధ్రులు గమనించాలని హితవు పలికారు. అరవయేళ్ల తెలంగాణ పోరాటంలో తెలంగాణలోని ఆంధ్రులకు ఎప్పుడైనా హాని తలపెట్టామా అని ప్రశ్నించారు.
పదమూడు రోజుల సమైక్యాం ధ్ర ఉద్యమంలో ఆంధ్రాలో ఉన్న తెలంగాణ వారికి హాని తలపెట్టడం ఏం సంస్కృతి అని నిలదీశారు. ఉద్యమంలో తెలంగాణవాదులపై పోలీసులు లెక్కలేనన్ని కేసులు పెట్టి హింసించారన్నారు. సీమాంధ్రులు పోలీసుల ముందే దేశ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే కేసులు పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీపై సీమాంధ్ర నాయకులు హెచ్చరికలు చేసిన పోలీసులు సుమోటో కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు దేవరాం, సత్యనారాయణగౌడ్, సత్తెక్క, సారా సు రేశ్, కిషన్, అశోక్, బాలయ్య పాల్గొన్నారు.