సీఎంను అరెస్టు చేసేందుకు సుప్రీంకోర్టుకు..
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యను అరెస్టు చేయకుండా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టి వెంటనే వీరభద్ర సింగ్‌ను అరెస్టు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అత్యవసర వాదోపవాదనల పిటిషన్ దాఖలు చేశారు. లెక్కకు మించిన అక్రమాస్తులను కలిగి ఉన్నారని ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈ కేసులో వారిని అరెస్టు చేసి విచారణ చేయాలని సీబీఐ భావించగా వీరభద్ర సింగ్ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి ఉపశమనం, ఇతర వెసులుబాటులు పొందారు. ఈ నేపధ్యంలో సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం దసరా తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని పేర్కొంది. ఈ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి అరుణ్ మిశ్రా.. దీనిని అత్యవసరంగా విచారణ చేపట్టే అంశంగా తాము భావించడం లేదని, రేపటికి రేపు వాదోపవాదనలు ప్రారంభించలేమని చెప్పారు. దీంతో ప్రస్తుతం దసరా పండుగ పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు ఉపశమనం లభించినట్లయింది.