Coconut Development Corporation
-
కొత్తగా 1,000 హెక్టార్లలో కొబ్బరి సాగు
సాక్షి, అమరావతి: కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ)తో కలిసి ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొబ్బరి తోటల పునరుద్ధరణ, సాగు విస్తరణ తదితర స్కీమ్స్ కోసం రూ.10.76 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అమలు చేస్తోన్న స్కీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ► కొబ్బరి విస్తరణ ప్రాజెక్టు కింద ఈ ఏడాది రూ.74.50 లక్షల అంచనాతో 1,000 హెక్టార్లలో కొత్తగా కొబ్బరి సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. హెక్టార్‌కు రూ.8 వేల చొప్పున సబ్సిడీ ఇస్తారు. ► పాత తోటల పునరుజ్జీవం, పునరుద్ధరణ పథకం కింద రూ.8.15 కోట్లతో 1,250 హెక్టార్లలో దిగుబడినివ్వని పాత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతోపాటు ప్రస్తుతమున్న తోటలను మరింత దిగుబడి వచ్చేలా అభివృద్ధి చేస్తారు. తొలి 20 చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.500 చొప్పున, ఆ తర్వాత ప్రతీ చెట్టుకు రూ.250 చొప్పున హెక్టార్లో 13 వేల చెట్లకు సబ్సిడీ ఇస్తారు. ► డిమాన్స్ట్రేషన్ కమ్ సీడ్ ప్రొడక్షన్ ఫామ్ (డీఎస్పీ) నిర్వహణ కింద వేగివాడలో సీబీడీ ఆధ్వర్యంలో ఉన్న 40 ఎకరాల్లో ఈ ఏడాది రూ.27 లక్షలతో 60 వేల విత్తనోత్పత్తి చేయనున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 లక్షల విత్తనోత్పత్తి కోసం రూ.96 లక్షలు ఖర్చుచేయనున్నారు. ► రూ.6 లక్షల అంచనాతో ఒక న్యూక్లియర్ కోకోనట్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తాన్ని తొలి ఏడాది రూ.3 లక్షలు, రెండో ఏడాది 1.50 లక్షలు, మూడో ఏడాది రూ.1.50 లక్షల చొప్పున మూడేళ్ల పాటు సర్దుబాటు చేస్తారు. ఇందులో 25 శాతం సబ్సిడీ ఇస్తారు. ► స్మాల్ కోకోనట్ నర్సరీ స్కీమ్ కింద ఒక్కో నర్సరీకి రూ.2 లక్షల అంచనాతో 10 యూనిట్లను మంజూరు చేయనున్నారు. 25 శాతం సబ్సిడీ ఇస్తారు. ► ఉత్పత్తిని మెరుగుపర్చే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ ఫర్ ప్రొడెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కింద 91.82 హెక్టార్లలో నమూనా క్షేత్రాల ప్రదర్శన కోసం రూ.21.53 లక్షలు ఖర్చు చేయనున్నారు. ► రూ.1.60 లక్షలతో నాలుగు ఆర్గానిక్ మెన్యూర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ► ఈ ఏడాది కోకోనట్ పామ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 64 వేల చెట్లకు రూ.9 లక్షలతో బీమా కల్పించనున్నారు. ఇందుకోసం 50 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించనుండగా, మిగిలిన 25 శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ► కేర సురక్ష స్కీమ్ కింద 370 మంది కొబ్బరి దింపు కార్మికులకు రూ.1.48 లక్షలతో బీమా కల్పించనున్నారు. -
కొబ్బరి దింపు.. ఉండదిక జంకు
సాక్షి, అమరావతి: కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి నేలకు దించే (కొబ్బరి దింపు) విషయంలో రైతులు పడే వెతలు అన్నీఇన్నీ కావు. కొబ్బరి దింపు కార్మికులకు ఆదాయం తక్కువగా ఉండటం.. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు ఉండటం లేదు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం పరిష్కారం చూపుతోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపుతోంది. ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ కొబ్బరి చెట్టుపైకి సునాయాసంగా ఎక్కగలిగే పరికరాన్ని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీబీడీ) రూపొందించింది. ఈ పరికరం ఆధారంగా కొబ్బరి చెట్లు ఎక్కడం, కాయల్ని కోసి దించడంపై అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ ఇస్తోంది. 18–45 ఏళ్ల మధ్య వయసు కలిగి 7వ తరగతి వరకు చదివిన యువతీ, యువకులను కొబ్బరి వృక్ష మిత్రలుగా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు ఎక్కడం, కాయలు దెబ్బతినకుండా నేలకు దించడం, కొబ్బరి తోటల్లో తెగుళ్ల నివారణ, ఎరువులు, పురుగుల మందుల ఉత్తమ యాజమాన్య పద్ధతులపై తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి చొప్పున 6 రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కోసం ఉద్యాన వర్సిటీ రూ.1,06,500 ఖర్చు చేస్తోంది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్తో పాటు రూ.2,500 విలువ గల చెట్టు ఎక్కే పరికరాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 26 బ్యాచ్‌లుగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పట్టణానికి చెందిన 520 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. తాజాగా అంబాజీపేట పరిశోధనా కేంద్రం సహకారంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విశాఖ జిల్లా అచ్యుతాపురం, చిత్తూరు జిల్లా కలికిరి, కృష్ణా జిల్లా గరికిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా (కేవీకే) శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. దింపు కార్మికులకూ పెరుగుతున్న ఆదాయం సాధారణంగా సంప్రదాయ కొబ్బరి దింపు కార్మికులు రోజుకు 30నుంచి 40 చెట్ల కాయల్ని దించగలరు. అదే శిక్షణ పొందిన వృక్ష మిత్రలైతే 70నుంచి 80 చెట్ల కాయలను దించగలుగుతున్నారు. సంప్రదాయ దింపు కార్మికులు రోజుకు రూ.300 సంపాదిస్తుండగా.. వృక్షమిత్రలు రోజుకు రూ.500 కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. శిక్షణ పొందాలనుకుంటే.. ఆసక్తి గల నిరుద్యోగులు ఎంతమంది ముందుకొచ్చినా శిక్షణ ఇచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. శిక్షణ పొందగోరే అభ్యర్థులు అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్ 08856–243847 లేదా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు (సెల్: 83095 38808)ను సంప్రదించవచ్చు. అభ్యర్థులకు సమీపంలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. స్థానికంగా ఉపాధి పొందగోరే యువత మాత్రమే కాకుండా కొబ్బరి తోటలు పెంచే రైతులు సైతం శిక్షణ పొందవచ్చు. నేనే దింపు తీసుకుంటున్నా నాకు మూడెకరాల కొబ్బరితోట ఉంది. దింపు సమస్యతో చాలా ఇబ్బందిపడే వాడిని. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ పొందా. ఇప్పుడు కార్మికులపై ఆధారపడకుండా నా తోటలో నేనే స్వయంగా కాయలు దింపుకోగలుగుతున్నా. దీనివల్ల నెలకు రూ.2 వేలకు పైగా మిగులుతోంది. – మట్టపర్తి వెంకట సుబ్బారావు, శిక్షణ పొందిన రైతు రోజుకు రూ.500 సంపాదిస్తున్నా నేను కూలీ పనులు చేసుకునే వాడిని. రోజూ రూ.300కు మించి ఆదాయం వచ్చేది కాదు. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ తీసుకున్నాను. ఉచితంగా ఇచ్చిన పరికరం సాయంతో సులభంగా కొబ్బరిచెట్లు ఎక్కి కాయల్ని దింపు తీస్తున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. – నెల్లి నవీన్, కొబ్బరి వృక్షమిత్ర, గంగలకుర్రు, తూర్పు గోదావరి సమయం.. పెట్టుబడి కలిసొస్తుంది. నాకు పదెకరా>ల కొబ్బరి తోట ఉంది. దశాబ్దాలుగా దింపు సమస్య ఎదుర్కొన్నా. శిక్షణ పొందిన కొబ్బరి వృక్షమిత్రలు రావడంతో దింపు కోసం ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు సమయం, పెట్టుబడి కూడా కలిసి వస్తోంది. – చేకూరి సూర్యనారాయణ, డైరెక్టర్, కృషివల కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీ దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం విశ్వవిద్యాలయం ద్వారా అంబాజీపేట పరిశోధనా కేంద్రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. శిక్షణ సందర్భంగా సాగులో యాజమాన్య మెళకువలపైనా తర్ఫీదు ఇస్తున్నాం. కొబ్బరి వృక్ష మిత్రల రాకతో కొబ్బరి దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ -
కొబ్బరి కేంద్రం ‘తూర్పు’కు దక్కేనా?
అమలాపురం :కొబ్బరి అభివృద్ధి సంస్థ (సీడీబీ) స్టేట్ సెంటర్ ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న ఆ సెంటర్‌ను ఏపీకి తరలించేందుకు సీడీబీ అంగీకరించింది. అయితే దీనిని కాబోయే రాజధాని విజయవాడలో ఏర్పాటు చేయాలా, రాష్ట్రంలోని కొబ్బరి సాగులో మూడొంతులు జరి గే ఉభయ గోదావరి జిల్లాల రైతులకు అందుబాటులో ఉండేలా రాజమండ్రిలో ఏర్పాటు చేయాలా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు స్పందిస్తే ఇది రాజమండ్రికి వచ్చే అవకాశముందని రైతులు చెబుతున్నారు. దేశంలో కొబ్బరి సాగు, దిగుబడిలో రాష్ట్రానిది నాలుగో స్థానం కాగా రాష్ట్రంలో మన జిల్లాది మొదటిస్థానం. అయినా కొబ్బరి సాగు ప్రోత్సాహకాలు, రాయితీలు అందుకునే విషయంలో మన రైతులు వెనుకబడి ఉన్నారు. సీడీబీ ప్రాంతీయ కార్యాలయం లేకనే ఈ దుస్థితి నెలకొంది. కోస్తాలో సాగు జరుగుతుంటే.. హైదరాబాద్‌లో స్టేట్ సెంటర్ ఉండడం వల్ల స్థానిక రైతులకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రాజధానిలో తమ కార్యాలయం ఉండాల్సి ఉన్నందున దీనిని అక్కడే ఉంచుతామని సీడీబీ చెపుతూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజనతో కొబ్బరి సాగు ఎక్కువగా జరుగుతున్న మన రాష్ట్రానికి కార్యాలయాన్ని మార్చాల్సి వచ్చింది. పదేళ్ల ఉమ్మడి రాజధాని నేపథ్యంలో దీనిని హైదరాబాద్‌లోనే ఉంచాలని సీడీబీ భావించినా రైతుల ఒత్తిడి నేపథ్యంలో ఏపీకి మార్చేందుకు అంగీకరించింది. అయితే స్టేట్ సెంటర్ స్థానంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను మాత్రం సీడీబీ పక్కనబెట్టింది. రాజధానిలో మాత్రమే కార్యాలయాలు ఉండే విధానానికి అనుగుణంగా స్టేట్‌సెంటర్‌ను విజయవాడ సమీపంలో నెలకొల్పాలని యోచిస్తోంది. దీనికి ఉభయగోదావరి జిల్లాల రైతులు అభ్యంతరం చెబుతున్నారు. కోనసీమలోనే లక్ష ఎకరాల్లో కొబ్బరిసాగు రాాష్ట్రంలో సుమారు 3.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.75 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిలో లక్ష ఎకరాలు కోనసీమలోనే ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి ఎగుమతి, దిగుమతి కేంద్రమైన అంబాజీపేటలో సీడీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న రైతుల డిమాండ్‌ను సీడీబీ చెవికి ఎక్కించుకోవడం లేదు. తమ కార్యాలయం ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ఉండాలని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పది మంది సిబ్బంది పనిచేసే సీడీబీ కార్యాలయానికి ఎయిర్ పోర్టు అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మధురపూడిని దృష్టిలో పెట్టుకుని కనీసం రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో క్వాయర్ రీజనల్ బోర్డు ఉన్నందున సీడీబీ స్టేట్ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తేనే మంచిదని నిపుణులూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ‘సాక్షి’ ప్రస్తావించింది. దీనిపై స్పందించిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు సైతం జిల్లాలో సీడీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయమంత్రిత్వ శాఖను కోరారు. దీనికి సానుకూల స్పందన వచ్చిందని ఆయన ఇటీవల విలేకరులకు తెలిపారు. అయితే సీడీబీ మాత్రం స్టేట్‌సెంటర్‌ను విజయవాడలోనే ఏర్పాటు చేస్తామని పట్టు పడుతోంది. ఇటీవల కాకినాడ ఎంపీ తోట నరసింహం సీడీబీ సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనతో పాట కోనసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రబాబు, రాజమండ్రికి కార్యాలయం వచ్చే అవకాశమున్నందున అక్కడి ఎంపీ ఎం.మురళీమోహన్ కలసికట్టుగా కృషి చేస్తే సీడీబీ స్టేట్ సెంటర్ జిల్లాలో ఏర్పాటు కాగలదని రైతులు ఆశిస్తున్నారు.