కొబ్బరి కేంద్రం ‘తూర్పు’కు దక్కేనా? | Coconut Development Corporation State Center arrangement | Sakshi
Sakshi News home page

కొబ్బరి కేంద్రం ‘తూర్పు’కు దక్కేనా?

Published Thu, Sep 18 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

కొబ్బరి కేంద్రం ‘తూర్పు’కు దక్కేనా?

కొబ్బరి కేంద్రం ‘తూర్పు’కు దక్కేనా?

 అమలాపురం :కొబ్బరి అభివృద్ధి సంస్థ (సీడీబీ) స్టేట్ సెంటర్ ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న ఆ సెంటర్‌ను ఏపీకి తరలించేందుకు సీడీబీ అంగీకరించింది. అయితే దీనిని కాబోయే రాజధాని విజయవాడలో ఏర్పాటు చేయాలా, రాష్ట్రంలోని కొబ్బరి సాగులో మూడొంతులు  జరి గే ఉభయ గోదావరి జిల్లాల రైతులకు అందుబాటులో ఉండేలా రాజమండ్రిలో ఏర్పాటు చేయాలా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు స్పందిస్తే ఇది రాజమండ్రికి వచ్చే అవకాశముందని రైతులు చెబుతున్నారు. దేశంలో కొబ్బరి సాగు, దిగుబడిలో రాష్ట్రానిది నాలుగో స్థానం కాగా రాష్ట్రంలో మన జిల్లాది మొదటిస్థానం. అయినా కొబ్బరి సాగు ప్రోత్సాహకాలు, రాయితీలు అందుకునే విషయంలో మన రైతులు వెనుకబడి ఉన్నారు. సీడీబీ ప్రాంతీయ కార్యాలయం లేకనే ఈ దుస్థితి నెలకొంది.
 
 కోస్తాలో సాగు జరుగుతుంటే.. హైదరాబాద్‌లో స్టేట్ సెంటర్ ఉండడం వల్ల స్థానిక రైతులకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రాజధానిలో తమ కార్యాలయం ఉండాల్సి ఉన్నందున దీనిని అక్కడే ఉంచుతామని సీడీబీ చెపుతూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజనతో కొబ్బరి సాగు ఎక్కువగా జరుగుతున్న మన రాష్ట్రానికి కార్యాలయాన్ని మార్చాల్సి వచ్చింది. పదేళ్ల ఉమ్మడి రాజధాని నేపథ్యంలో దీనిని హైదరాబాద్‌లోనే ఉంచాలని సీడీబీ భావించినా రైతుల ఒత్తిడి నేపథ్యంలో ఏపీకి మార్చేందుకు అంగీకరించింది. అయితే స్టేట్ సెంటర్ స్థానంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను మాత్రం సీడీబీ పక్కనబెట్టింది. రాజధానిలో మాత్రమే కార్యాలయాలు ఉండే విధానానికి అనుగుణంగా  స్టేట్‌సెంటర్‌ను విజయవాడ సమీపంలో నెలకొల్పాలని యోచిస్తోంది. దీనికి ఉభయగోదావరి జిల్లాల రైతులు అభ్యంతరం చెబుతున్నారు.
 
 కోనసీమలోనే లక్ష ఎకరాల్లో కొబ్బరిసాగు
 రాాష్ట్రంలో సుమారు 3.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.75 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిలో లక్ష ఎకరాలు కోనసీమలోనే ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి ఎగుమతి, దిగుమతి కేంద్రమైన అంబాజీపేటలో సీడీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న రైతుల డిమాండ్‌ను సీడీబీ చెవికి ఎక్కించుకోవడం లేదు.
 
 తమ కార్యాలయం ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ఉండాలని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పది మంది సిబ్బంది పనిచేసే సీడీబీ కార్యాలయానికి ఎయిర్ పోర్టు అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మధురపూడిని దృష్టిలో పెట్టుకుని కనీసం రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో క్వాయర్ రీజనల్ బోర్డు ఉన్నందున సీడీబీ స్టేట్ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తేనే మంచిదని నిపుణులూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ‘సాక్షి’ ప్రస్తావించింది. దీనిపై స్పందించిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు సైతం జిల్లాలో సీడీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయమంత్రిత్వ శాఖను కోరారు. దీనికి సానుకూల స్పందన వచ్చిందని ఆయన ఇటీవల విలేకరులకు తెలిపారు. అయితే సీడీబీ మాత్రం స్టేట్‌సెంటర్‌ను విజయవాడలోనే ఏర్పాటు చేస్తామని పట్టు పడుతోంది.  ఇటీవల కాకినాడ  ఎంపీ తోట నరసింహం సీడీబీ సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనతో పాట కోనసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రబాబు, రాజమండ్రికి కార్యాలయం వచ్చే అవకాశమున్నందున అక్కడి ఎంపీ ఎం.మురళీమోహన్ కలసికట్టుగా కృషి చేస్తే సీడీబీ స్టేట్ సెంటర్ జిల్లాలో ఏర్పాటు కాగలదని రైతులు ఆశిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement