Coconut products
-
కేరళలో ‘కొబ్బరి’ రోడ్లు!
రోడ్ల నిర్మాణంలో కొబ్బరి ఉత్పత్తులు కొబ్బరి పట్టాలతో మట్టి కట్టలు కాసులు కురిపిస్తున్న వైనం ఏకంగా రూ.1,500 కోట్ల ఎగుమతులు రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: కేరళ. ఈ పేరు వింటూనే టక్కున గుర్తొచ్చేది కొబ్బరి. ఎటు చూసినా దట్టంగా కొబ్బరిచెట్లతో కళకళలాడుతూ ఉంటుందా రాష్ట్రం. కొబ్బరితో పసందైన వంటలకు పెట్టింది పేరైన కేరళ ఇప్పుడు దాన్ని భారీగా ఆదాయం సమకూర్చి పెట్టే పరిశ్రమగా కూడా మార్చుకుంటోంది. అందులో భాగంగా ఏకంగా రోడ్ల నిర్మాణంలో కూడా ‘కొబ్బరి’ని వాడుతోంది! కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవమే. కొబ్బరి ఉత్పత్తులను రోడ్ల నిర్మాణంలో విరివిగా వాడుతోంది కేరళ ప్రభుత్వం. ఎంతగా అంటే, వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయం పొందేంతగా! ప్రసుతం ఏటా దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు రోడ్ల నిర్మాణం నిమిత్తం కేరళ నుంచి ఎగుమతి అవున్నాయి. ఈ ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కేరళ!! ఏం చేస్తారంటే... రోడ్ల నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తారు, కాంక్రిట్ మిక్స్ మాత్రమే నాణ్యంగా ఉంటే చాలదు. రోడ్డు నిర్మాణానికి తోడ్పడే మట్టి కట్ట కూడా బలంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా వాన నీటికి మట్టి జారిపోయి రోడ్డు కుంగిపోవటమో, భారీ కోతకు గురవడమో జరుగుతుంది. ఈ సమస్యకు కొబ్బరినే తిరుగులేని పరిష్కారంగా మార్చుకుంది కేరళ. రోడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు ముందుగా ఎత్తుగా మట్టికట్ట వేసి దాని మీద తారో, కాంక్రిట్ మిక్సో వేస్తారు. ఆ కట్ట బలహీనపడకుండా కేరళ కొబ్బరి ఉత్పత్తులు కాపుకాస్తాయన్నమాట. అదెలాగంటే... మట్టికట్ట వేసేముందే దానికి రెండువైపులా కొబ్బరి నారతో చేసిన పట్టాలను పరుస్తారు. వాటిపై వట్టి వేర్లు, ప్రత్యేక రకం గడ్డి విత్తనాలు చల్లుతారు. వాటిపై వారం పాటు నీటిని పిచికారి చేస్తారు. తర్వాత దానిపై కొన్ని మట్టి పొరలు వేసి మిగతా రోడ్డు నిర్మాణాన్ని మామూలుగానే పూర్తి చేస్తారు. తర్వాత కొద్ది రోజుల్లోనే కొబ్బరి నార పట్టాల లోపలి నుంచి వట్టి వేర్లు, గడ్డి బయటకు చొచ్చుకుని వస్తాయి. వాటి వేర్లు మాత్రం లోలోపలికి బలంగా పాకిపోతాయి. అలా మట్టికట్టకు చక్కని పటుత్వం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో కొబ్బరి నార పట్టాలు జీర్ణమై మట్టిలో కలిసిపోతాయి. వేర్లు మాత్రం మరింత బలంగా మారతాయి. ఈ పరిజ్ఞానం విదేశీయులను బాగా ఆకట్టుకుంది. ఎంతగా అంటే... ప్రస్తుతం జర్మనీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలకు కేరళ నుంచి భారీగా కొబ్బరి నార పట్టాలు ఎగుమతవు తున్నాయి. రోడ్డు వేసే ప్రాంతంలో ఉన్న నేల స్వభావం ఆధారంగా ఈ పట్టాల డిజైన్ కూడా పలు రకాలుగా ఉంటుంది!! ప్రస్తుతం కేరళలో ఏకంగా 90 కంపెనీలు ఈ పట్టాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇటీవల ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణంలో ‘కేరళ’ పట్టాల వాడకం బాగా పెరిగింది. ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్లో కేరళకు చెందిన ‘చరన్కట్ట కాయర్’ కంపెనీ తన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది.‘రోడ్ల నిర్మాణంలో మట్టికట్టలను పరిరక్షించేందుకు ప్రస్తుతం సింథటిక్ వస్తువులు అందుబాటులో ఉన్నా అవి పర్యావరణానికి హాని చేసేవి. అందుకే వాటి బదులు పర్యావరణహితమైన కొబ్బరి నార పట్టా విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మున్ముందు మా ఎగుమతులు బాగా పెరుగుతాయి. దీనికి భారత కాయర్ బోర్డు సహకారం కూడా బాగుంది’ అని చరన్కట్ట కాయర్ సంస్థ ప్రతినిధి అరుణ్ తెలిపారు. పాపం పంచాయతీరాజ్! సాధారణంగా ఎగ్జిబిషన్ స్టాల్లో ఉత్పత్తుల గురించి, తమ విజయాల గురించి తెలిపే పుస్తకాలు, ఫొటోలు ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు వాటిని పంచిపెడతారు. అలాగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్లో పంచాయితీరాజ్ శాఖ కూడా ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో పంచాయితీరాశ్ శాఖ విజయాలు, రోడ్ల నిర్మాణానికి సూచనలు, సలహాలు, అనుభవాలతో కూడిన పుస్తకాలు, బ్రోచర్లను ప్రత్యేకంగా ముద్రించింది. కానీ ప్రతిదానికీ కేవలం ఒక్కో కాపీని మాత్రమే స్టాల్లో ఉంచింది. సందర్శకులంతా తమకో కాపీ కావాలంటుండటంతో సిబ్బందికి పాలుపోవడం లేదు. ‘పై అధికారులు మాకు అదనపు పుస్తకాలు, బ్రోచర్లు ఇవ్వలేదు. డిస్ప్లే కోసం ఒక్కో ప్రతే ఇచ్చారు. దయచేసి చూసి వెళ్లండంతే’ అని బదులిస్తున్నారు. కానీ సందర్శకుల బాగా పెరగడంతో అందరికీ సమాధానం చెప్పలేక ‘పుస్తకాలు, ఇతర ప్రచురణలు కేవలం డిస్ప్లే కోసం మాత్రమే’ అని కాగితాలపై రాసి స్టాల్ చుట్టూ అంటించారు! -
పండగ వేళా.. కొబ్బరి డీలా!
అమలాపురం :కొబ్బరి ఉత్పత్తుల ధరలు భారీగా క్షీణించాయి. మరో వారం రోజుల్లో దసరా పండుగ రానున్న సమయంలో ధరలు పెరగాల్సింది పోయి తగ్గడం రైతులను కుంగదీస్తోంది. గతంలో దసరా, దీపావళి సమయంలో పచ్చి కొబ్బరికి మంచి ధర వచ్చేది. స్థానికంగానే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో వినియోగం బాగా పెరగడం వల్ల ధర పెరగడం సర్వసాధారణం. ఈసారి పరిస్థితి తలకిందులైంది. అక్కడ డిమాండ్ తగ్గడం, దిగుబడులు కూడా పెరగడం వల్ల అనుకున్నట్టుగా ధర పెరగలేదు సరికదా, ఉన్న ధరలు కూడా పడిపోయాయి. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో పచ్చికొబ్బరి వెయ్యి కాయలు పదిహేను రోజుల క్రితం రూ.8,500 ఉండగా, ఇప్పుడు రూ.7,600కు పడిపోయింది. లంకకాయను రూ.7,900 చేసి కొంటున్నారు. గతంలో ఇదే కాయను రూ.8,900 చేసి కొనేవారు. పాత ముక్కుడు కాయ (నిల్వకాయ) రూ.8 వేలు ఉండగా, రూ.7,500కు తగ్గింది. రైతులకు నేరుగా మేలు చేసేది పచ్చికాయ, ముక్కుడు కాయలు మాత్రమే. దసరా, దీపావళిని దృష్టిలో పెటుకుని రైతులు గత నెల రోజుల నుంచి అమ్మకాలు చేయకుండా కాయను నిల్వ ఉంచారు. ఉత్తరాదిన పక్షం రోజులు (మూఢం) కావడంతో దసరా పండుగ చేసుకుంటున్నా శుభ కార్యక్రమాలు జరగడం లేదు. ఈ సీజన్లో దసరా సైతం అనుకున్న స్థాయిలో నిర్వహించరని, దీని వల్ల పెద్దగా కొనుగోలు చేయడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీనితో పదిహేను రోజుల వ్యవధిలో పచ్చికొబ్బరి ధర రూ.వెయ్యి మేరకు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ సీజన్లో రోజుకు 80 నుంచి 100 లారీల పచ్చికొబ్బరి ఎగుమతి ఉత్తరాది రాష్ట్రాలకు జరుగుతుంటుంది. ప్రస్తుతం 40 లారీలకు మించడం లేదు. సగానికి పైగా ఎగుమతులు నిలిచిపోయాయి. వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, అప్పనపల్లి, అంబాజీపేట, మామిడికుదురు వంటి గ్రామాల్లో లక్షల్లో కొబ్బరికాయలు రాశులుగా పేరుకుపోయాయి. వారొకటి తలిస్తే... సాధారణంగా మార్కెట్లో ఉన్న ధరకన్నా కాయకు రూ.ఒకటి, రెండు రూపాయలు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. దసరా, దీపావళిని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి కాయలకు రూ.10 వేల వరకు ధర వస్తుందని వ్యాపారులు, రైతులు అంచనా వేశారు. కొబ్బరి ధర రూ.8 వేల వరకు ఉండగా అంతకుమించి ధర పెట్టి భారీగా కొనుగోలు చేశారు. డిమాండ్ లేకపోవడానికి తోడు భారీ వర్షాలు లేకపోవడంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొబ్బరి దిగుబడి కూడా ఎక్కువగా ఉంది. ఎకరాకు రెండు నెలల దింపు 1,200 కాయలకు పైబడి రావడంతో దిగుబడి పెరిగి అనుకున్న ధర రాలేదు. మిగతా రకాలదీ అదే బాట పచ్చికొబ్బరి, ముక్కుడు కాయల ధరే కాకుండా మార్కెట్లో ఇతర కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం భారీగా పతనమయ్యాయి. కొత్త కొబ్బరి (తయారీ కొబ్బరి) పదిహేను రోజుల క్రితం క్వింటాల్ ధర రూ.11 వేలు ఉండగా, తాజాగా దీని ధర రూ.9,500కు పడిపోయింది. కురిడీ కొబ్బరి పాతకాయల్లో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.14 వేలు ఉండగా, ఇప్పుడు రూ.13 వేలకు, గటగట రకం రూ.12 వేల నుంచి రూ.11 వేలకు, కురిడీ కొత్తకాయలో గండేరా రకం రూ.13 వేల నుంచి రూ.12 వేలకు, గటగట 11 వేల నుంచి రూ.10 వేలకు తగ్గింది. -
కృత్తివెన్ను..కృష్ణా కోనసీమ
రాష్ట్రాన్ని దాటుతున్న కొబ్బరి ఉత్పత్తులు రైతులను ఆదుకుంటున్న కొబ్బరిసాగు పరిశ్రమలకు నోచని వైనం కనుచూపు మేరలో కొబ్బరిచెట్ల అందాలతో కనువిందుచేసే కృత్తివెన్ను మండలం కృష్ణా జిల్లా కోనసీమగా పేరుపొందింది. వందల ఎకరాల్లో విస్తరించిన కొబ్బరి చెట్లు రైతులకు ఆదాయం అందించడంతోపాటు కూలీలకు ఉపాధి చూపుతున్నాయి. పొలం గట్లు, చేపలచెరువు గట్టులపైనా కొబ్బరి సాగు సాగుతోంది. కొబ్బరి కాయలు, బొండాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతవుతున్నాయి. కృత్తివెన్ను : కృష్ణా జిల్లా కోనసీమగా ప్రసిద్ధి గాంచిన కృత్తివెన్ను మండలం నుంచి కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. మండలంలోని చినగొల్లపాలెందీవిలో కొబ్బరే ప్రధాన పంట. అయితే మండల వ్యాప్తంగా ఇంచుమించు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లు ఉన్నాయి. వరి, ఆక్వా సాగుతోపాటు కొబ్బరి ఉత్పత్తులు కూడా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నాయి. చినగొల్లపాలెం దీవిలో 800 ఎకరాల పైచిలుకు భూముల్లో కొబ్బరి ప్రధాన పంటగా సాగవుతోంది. రైతులకు ఆదాయం సమకూరుస్తున్న ఈ కొబ్బరి సాగు కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తోంది. ఏటా వేల సంఖ్యలో లారీల్లో ఇక్కడి నుంచి కొబ్బరి ఉత్పత్తులు మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో సైతం దీవి వాసులు జలమార్గం ద్వారా పడవలపై సుదూర ప్రాంతాలకు కొబ్బరి ఉత్పత్తులు సరఫరా చేసేవారు. దీంతో పాటు మండలంలోని మిగిలిన గ్రామాల్లో పంట పొలాలు చేపలు, రొయ్యల చెరువుల వెంబడి పెద్ద ఎత్తున కొబ్బరిచెట్ల సాగు జరుగుతోంది. దీని ద్వారా వ్యవసాయంతో పాటు రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. వేసవిలో బొండాల ఎగుమతి ఒక్కొక్క కొబ్బరి చెట్టు నుంచి రైతుకు సంవత్సరానికి వెయి రూపాయల నుంచి రూ.1500 వరకూ ఆదాయం సమకూరుతోంది. వేసవిలో పెద్ద ఎత్తున కొబ్బరి రైతులు బొండాల ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి నిత్యం వేసవిలో సుమారు 50 వేల నుంచి 70 వేల బొండాలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ప్రాంతానికి రెండో పంట సైతం లేని రోజుల్లో రైతులను కొబ్బరి చెట్లు ఆదుకున్నాయని అంటే అతిశయోక్తి కాదు. కృత్తివెన్ను మండలంలో పెద్ద ఎత్తున కొబ్బరి సాగుతోంది. ఎగుమతులు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. అయితే కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఒక్కటి కూడా లేకపోవడాన్ని మండల ప్రజలు దురదృష్టంగా భావిస్తున్నారు. సంబంధిత పరి శ్రమలను ఈ ప్రాంతంలో స్థాపిస్తే మంచి గిట్టుబాటు ధరతో పాటు ఇక్కడి ప్రజల నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని రైతులు పేర్కొం టున్నారు. కొత్త రాష్ట్రంలో పాలకులు తీరప్రాంతమైన మండల ంలో దృష్టిసారించి పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా పనిచేస్తే తమ జీవితాల్లోనూ వెలుగులు నింపిన వారవుతారని స్థాని కులు సూచిస్తున్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు నేను 30 ఏళ్లుగా కొబ్బరి కాయలు వలుస్తున్నా. రోజంతా కష్టపడినా చాలీచాలని జీతమే. మా మండలానికి కొబ్బరి అనుబంధ పరిశ్రమలైనా వస్తే నాలాంటి వారితో పాటు చదువుకున్న నిరుద్యోగులకు పని దొరుకుతుంది. -బుల్లబ్బాయి, కృత్తివెన్ను ఒళ్లు హూనమవుతోంది కొబ్బరి ఒలుపు కార్మికుడిగా 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఒళ్లు హూనం అవటమే గానీ గిట్టుబాటు కూలి లభించడంలేదు. మా లాంటి వారి కష్టాలు తీరాలంటే మా ప్రాంతానికి కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి. - రంగ, అడ్డపర్ర