పండగ వేళా.. కొబ్బరి డీలా! | Coconut products, prices plummeted | Sakshi
Sakshi News home page

పండగ వేళా.. కొబ్బరి డీలా!

Published Wed, Sep 24 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

పండగ వేళా.. కొబ్బరి డీలా!

పండగ వేళా.. కొబ్బరి డీలా!

అమలాపురం :కొబ్బరి ఉత్పత్తుల ధరలు భారీగా క్షీణించాయి. మరో వారం రోజుల్లో దసరా పండుగ రానున్న సమయంలో ధరలు పెరగాల్సింది పోయి తగ్గడం రైతులను కుంగదీస్తోంది. గతంలో దసరా, దీపావళి సమయంలో పచ్చి కొబ్బరికి మంచి ధర వచ్చేది. స్థానికంగానే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో వినియోగం బాగా పెరగడం వల్ల ధర పెరగడం సర్వసాధారణం. ఈసారి పరిస్థితి తలకిందులైంది. అక్కడ డిమాండ్ తగ్గడం, దిగుబడులు కూడా పెరగడం వల్ల అనుకున్నట్టుగా ధర పెరగలేదు సరికదా, ఉన్న ధరలు కూడా పడిపోయాయి. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో పచ్చికొబ్బరి వెయ్యి కాయలు పదిహేను రోజుల క్రితం రూ.8,500 ఉండగా, ఇప్పుడు రూ.7,600కు పడిపోయింది.
 
 లంకకాయను రూ.7,900 చేసి కొంటున్నారు. గతంలో ఇదే కాయను రూ.8,900 చేసి కొనేవారు. పాత ముక్కుడు కాయ (నిల్వకాయ) రూ.8 వేలు ఉండగా, రూ.7,500కు తగ్గింది. రైతులకు నేరుగా మేలు చేసేది పచ్చికాయ, ముక్కుడు కాయలు మాత్రమే. దసరా, దీపావళిని దృష్టిలో పెటుకుని రైతులు గత నెల రోజుల నుంచి అమ్మకాలు చేయకుండా కాయను నిల్వ ఉంచారు. ఉత్తరాదిన పక్షం రోజులు (మూఢం) కావడంతో దసరా పండుగ చేసుకుంటున్నా శుభ కార్యక్రమాలు జరగడం లేదు. ఈ సీజన్‌లో దసరా సైతం అనుకున్న స్థాయిలో నిర్వహించరని, దీని వల్ల పెద్దగా కొనుగోలు చేయడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీనితో పదిహేను రోజుల వ్యవధిలో పచ్చికొబ్బరి ధర రూ.వెయ్యి మేరకు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ సీజన్‌లో రోజుకు 80 నుంచి 100 లారీల పచ్చికొబ్బరి ఎగుమతి ఉత్తరాది రాష్ట్రాలకు జరుగుతుంటుంది. ప్రస్తుతం 40 లారీలకు మించడం లేదు. సగానికి పైగా ఎగుమతులు నిలిచిపోయాయి. వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, అప్పనపల్లి, అంబాజీపేట, మామిడికుదురు వంటి గ్రామాల్లో లక్షల్లో కొబ్బరికాయలు రాశులుగా పేరుకుపోయాయి.
 
 వారొకటి తలిస్తే...
 సాధారణంగా మార్కెట్‌లో ఉన్న ధరకన్నా కాయకు రూ.ఒకటి, రెండు రూపాయలు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. దసరా, దీపావళిని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి కాయలకు రూ.10 వేల వరకు ధర వస్తుందని వ్యాపారులు, రైతులు అంచనా వేశారు. కొబ్బరి ధర రూ.8 వేల వరకు ఉండగా అంతకుమించి ధర పెట్టి భారీగా కొనుగోలు చేశారు. డిమాండ్ లేకపోవడానికి తోడు భారీ వర్షాలు లేకపోవడంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొబ్బరి దిగుబడి కూడా ఎక్కువగా ఉంది. ఎకరాకు రెండు నెలల దింపు 1,200 కాయలకు పైబడి రావడంతో దిగుబడి పెరిగి అనుకున్న ధర రాలేదు.
 
 మిగతా రకాలదీ అదే బాట
 పచ్చికొబ్బరి, ముక్కుడు కాయల ధరే కాకుండా మార్కెట్‌లో ఇతర కొబ్బరి ఉత్పత్తుల ధరలు సైతం భారీగా పతనమయ్యాయి. కొత్త కొబ్బరి (తయారీ కొబ్బరి) పదిహేను రోజుల క్రితం క్వింటాల్ ధర రూ.11 వేలు ఉండగా, తాజాగా దీని ధర రూ.9,500కు పడిపోయింది. కురిడీ కొబ్బరి పాతకాయల్లో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.14 వేలు ఉండగా, ఇప్పుడు రూ.13 వేలకు, గటగట రకం రూ.12 వేల నుంచి రూ.11 వేలకు, కురిడీ కొత్తకాయలో గండేరా రకం రూ.13 వేల నుంచి రూ.12 వేలకు, గటగట 11 వేల నుంచి రూ.10 వేలకు తగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement