Cold conditions
-
ఈసారి వణుకుడే..
అప్పుడే చలి మొదలైంది. అయితే ఇది జస్ట్ శాంపిలే.. మున్ముందు జనమంతా గజగజ వణికిపోక తప్పదట. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని,మంచు కురిసే అవకాశమూ ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనంతటికీ లానినా పరిస్థితి కారణమని అంటున్నారు. మరి లానినా ఏంటి, చలి విపరీతంగా పెరగడం ఏమిటి, దీనికి దానికి లంకె ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఇప్పటిదాకా భారీ వర్షాలు.. సాధారణంగా ఎల్‌నినో, లానినా పరిస్థితులు ఏర్పడినప్పుడు మన దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజన్లలో గణనీయంగా మార్పులు వస్తాయి. ఈసారి లానినా కారణంగా నైరుతి రుతు పవనాలు ఎక్కువకాలం కొనసాగాయి. 1975 త ర్వాత ఇంత సుదీర్ఘంగా నైరుతి సీజన్ ఉండటం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ►మన దేశానికి సంబంధించినంత వరకు.. ఎల్‌నినో సమయంలో ఏ సీజన్ అయినా కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, వానలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. లానినా సమయంలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా.. వానాకాలంలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. ►పసిఫిక్ మహా సముద్రంపై రెండేళ్లుగా లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది దాని ప్రభావం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదయ్యాయి. తర్వాత వానాకాలం మొదలైనప్పటి నుంచీ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల్లో అక్కడక్కడా ఇప్పటికీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక చలిచలిగా.. లానినా కారణంగా పసిఫిక్ మహా సముద్రం వైపు నుంచి శీతల గాలులు వీస్తాయని.. దీనితో భూమి ఉత్తర అర్ధభాగంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)’ తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండంలో దిగువభాగంలోని దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై లానినా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతంలో చలి మొదలైందని.. చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ►ముఖ్యంగా డిసెంబర్ మూడో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు చలి విపరీతంగా ఉంటుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం మొదలైందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ సాధారణంతో పోలిస్తే.. మూడు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ►చైనాలోని తూర్పు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయాయని.. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోనూ చలి తీవ్రత మొదలైందని.. ఆయా దేశాల వాతావరణ అధికారులు ప్రకటించడం గమనార్హం. ఏమిటీ ఎల్‌నినో, లానినా? భూమ్మీద అతిపెద్ద మహా సముద్రమైన పసిఫిక్ సముద్రం ఉపరితలంలోని నీటి ఉష్ణోగ్రతల్లో కొన్నేళ్లకోసారి హెచ్చుతగ్గులు వస్తుంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాల్లో.. ఖండాల మీదుగా వీచే పవనాల (గాలుల) ఉష్ణోగ్రతలు, తేమ శాతంలో మార్పులు వస్తాయి. పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినోగా.. తగ్గడాన్ని లానినాగా పిలుస్తారు. ఈ రెండు కూడా పసిఫిక్ మహా సముద్రం చుట్టూ ఉన్న వేర్వేరు ప్రాంతాలపై ఒకదానికొకటి వేర్వేరుగా, వ్యతిరేక ప్రభావం చూపుతాయి. ►ఉదాహరణకు ఎల్‌నినోతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే.. మరికొన్నిచోట్ల వానలు తగ్గి, ఎండలు పెరిగి కరువులు ఏర్పడతాయి. ►అదే లానినా వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా.. ఎల్‌నినోతో వరదలు వచ్చే చోట కరువులు వస్తాయి, ఎండలు ఉండే చోట భారీ వర్షాలు కురుస్తాయి. ఓ వైపు కరువు.. మరోవైపు వరదలు లానినా కారణంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో తీవ్ర కరువు పరిస్థి తులు ఏర్పడ్డాయి. పసిఫిక్ మహా సముద్రానికి పశ్చి మాన ఉన్న దేశాల్లో, హిందూ మహాసముద్ర ప్రాంతదేశాల్లో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మంచి వర్షాలు కురిశాయి. ►ప్రస్తుతం అమెరికాలో వానాకాలం మొదలైంది. లానినా ప్రభావం కారణంగా ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని, తుపానులు వస్తాయని, తర్వాత చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవచ్చని ఆ దేశ వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. -
హుహు..హూ! రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, పాలమూరు: వారం రోజులుగా వాతావరణం లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా జిల్లా లో చలివిపరీతంగా పెరిగింది. రాత్రి వేళ ఉష్ణో గ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటికి రావాలంటే వెనకాడుతున్నారు. ఆరురోజుల నుంచి సాయంత్రం కాగానే ఆకా శంలో మేఘా లు కమ్ముకోవడం, చల్లని గాలు లు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నా రు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తుండటంతో ప్రయాణానికి ఆటంకం కలుగుతోంది. జాగ్రత్తలు తప్పనిసరి.. చలికాలంలో వృద్ధులు, చిన్న పిల్లలపట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటున్నా సాయంత్రం తర్వాత పెరుగుతుండటంతో ప్రజలు చలిని తట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోపాటు ఉన్ని దుస్తులు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా జలజ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకు చేరుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకుంటే శరీరాన్ని కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. హైపథెరమితో ముప్పు చలి తీవ్రతను కొందరు వృద్ధుల్లో చేతులు వంకర పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ప్రాస్ట్బైట్ అంటారు. వృద్ధుల శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు ఉత్పత్తి కాకపోవడంతో మరణాలు సంభవిస్తాయి. దీన్ని వైద్య పరిభాషలో హైపోథెరమి అంటారు. శరీరంలోని రక్తనాళాల్లో రక్తం సరఫరాలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ కాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. జలుబు వల్ల ముక్కులోని నాళాల్లో సున్నితత్వం పెరుగుతుంది. ఇది ఆస్తామా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పొడి చర్మం కలిగిన వారిలో దురదలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. గతంలో కీళ్ల నొప్పులు ఉన్న వారికి సమస్య అధికమవుతుంది. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలీమార్పస్లైట్తో సమస్య కొంత మందిలో చలి కాలంలో కూడా పొక్కులు వస్తాయి. దీన్ని పాలీమార్పస్లైట్ ఎరప్షన్ అంటారు. మహిళలు బట్టలు ఉతకడం, గిన్నెలను తోమడం వంటి పనులను ఎక్కువగా చేస్తుంటారు. చలికాలంలో ఎక్కువ సమయం నీళ్లలో చేతులు ఉంచి పనులు చేయడం వల్ల చేతిపై ఉండే నూనె పొర తొలగిపోతుంది. సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం వల్ల నూనె పొర తొలిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా చర్మం పొడిబారి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. శీతల గాలులు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. శరీరాన్ని రక్షించే క్రమంలో చర్మమే చలికి ప్రభావితమవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. నూనె పొరను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో ఎండ తీక్షణంగా లేకపోయినా సూర్యకాంతి నుంచి అతినీలలోహిత కిరణాలు వెలువడతాయి. వ్యాయామానికి వెళ్లే ముందు ఎక్కువ మంది వ్యాయామం అంటే ఉదయపు నడకకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు, మధ్య వయసు ఉన్నవారు, వృద్ధులు ఎక్కువగా వెళ్తుంటారు. మిగితాకాలంలో పోల్చితే శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 6నుంచి 8గంటల మధ్య పొగ మంచులో కాలుష్యం కలిసి ఉంటుంది. బాగా ఎండ వచ్చే వరకు అదే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మార్నింగ్ రన్నింగ్ చేసే వాళ్లు దాన్ని పీల్చేవారు శ్వాసకోశ వ్యాధులు బారినపడే ప్రమాదం ఉంటుంది. ఈ మూడు నెలలు ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాత వాకింగ్ చేయడం ఉత్తమం. కుదరకపోతే సాయంత్రం వేళలో చేసుకోవాలి. తప్పదని అనుకునేవారు ముఖం, ముక్కు, చెవులు కప్పి ఉంచే టోపీలు, దుస్తులు, స్వెటర్లు ధరించాలి. -
గాలి మళ్లింది.. చలి తగ్గింది!
సాక్షి, విశాఖపట్నం: చలితో వణుకుతున్న రాష్ట్ర ప్రజలకు ఒకింత వెచ్చని వార్త! కొన్నాళ్ల నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో చలి ప్రభావంతో జనం ఒకింత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఆకస్మికంగా మార్పు చోటు చేసుకుంది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత అధికంగా ఉండడం, అటు నుంచి ఉత్తర గాలులు రాష్ట్రం వైపు వీయడంతో ఇక్కడ చలి ప్రభావం కనిపించింది. కానీ ఇప్పుడు ఉత్తరగాలులు తగ్గుముఖం పట్టాయి. వాటి స్థానంలో ఈశాన్య, తూర్పు గాలులు వీయడం మొదలెట్టాయి. దీంతో నిన్న మొన్నటిదాకా సాధారణంకంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదైన రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలి తగ్గడం మొదలైంది. ఉత్తరాదిలో పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) పశ్చిమ నుంచి తూర్పు దిశగా పయనిస్తుండడం వల్ల గాలులు మారడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సంక్రాంతి నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాక ఉత్తరం వైపుకు మళ్లుతాడు. దీంతో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ప్రారంభమవుతుందని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఇకపై రానురాను చలి తగ్గుతుందన్నారు. కాగా శుక్రవారం రాష్ట్రంలో అత్యల్పంగా జంగమహేశ్వరపురం, కళింగపట్నంలో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణంకంటే 2-3 డిగ్రీలు అధికంగా రికార్డయ్యాయి. 15న ఈశాన్య పవనాల ఉపసంహరణ మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఈనెల 15తో నిష్క్రమించనున్నాయి. ఏటా అక్టోబర్ 18-22 తేదీల మధ్య ఈశాన్య పవనాలు రాష్ట్రాన్ని తాకుతాయి. కానీ ఈ ఏడాది ఇవి నిర్ణీత సమయంకంటే వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కానీ ఈసారి దక్షిణ తమిళనాడులో ఒక మోస్తరు వర్షాలు కురిపించాయి తప్ప దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం ఏమంత ప్రభావం చూపలేదు. ఈశాన్య రుతుపవనాల సీజనులో 3-4 వాయుగుండాలు గాని 2-3 తుపాన్లు గాని ఏర్పడుతుంటాయి. కానీ ఈ సీజనులో రెండు వాయుగుండాలు ఏర్పడినా భారీ వర్షాలు కురిపించలేదు. అలాగే అవి బలపడి తుపాన్లుగానూ మారలేదు. ఈనెల 15తో ఈశాన్య రుతుపవనాల ఉపసంహరణ పూర్తవుతుంది. దీంతో ఇక ఇప్పట్లో రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. -
నేడు నాలుగు జిల్లాల్లో చలిపంజా!
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలో నల్లగొండ మినహా మిగిలినచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. భద్రాచలం, ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 13 డిగ్రీలు, మెదక్‌లో 14 డిగ్రీలు రికార్డు అయింది. ఖమ్మంలో 16 డిగ్రీలు, భద్రాచలం, హకీంపేట్, హైదరాబాద్‌లలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, రామగుండంలలో 18 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు అన్నిచోట్లా సాధారణం కంటే ఒకటి నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. అత్యంత ఎక్కువగా మెదక్‌లో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
‘వెనామీ’పై చలి పంజా
చలికి మేత తినక తగ్గిన పెరుగుదల ఆందోళనలో ఆక్వారైతు తోటపల్లిగూడూరు : ప్రస్తుతం తీర గ్రామాల్లో సాగులో ఉన్న వెనామీ రొయ్య చలికి వణుకుతోంది. సాధారణంగా శీతల పరిస్థితులను వెనామీ తట్టకోవడం కష్టం. వారం రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి, మంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతుంది. కొంత కాలంగా వెనామీ రొయ్య గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇటీవల వాయుగుండాలు, భారీ వర్షాలు, చలిగాలులు వరుస పెట్టాయి. ఈ క్రమంలో చలిగాలులు ఉధృతం కావడంతో ప్రస్తుతం సాగులో ఉన్న నెల లోపు వెనామీ రొయ్యలు చలికి తట్టకోలేక, మేత తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. గుంతలపై మంచు తెరలు ఉదయం 10 గంటలకు కూడా తొలగడం లేదు. చలి తీవ్రతకు రొయ్య పిల్ల సరిపడినంత మేత కూడా తీసుకోలేక పెరుగుదలలో లోపం కన్పిస్తోంది. చలికి కొన్ని పిల్లలు గుంతల్లోనే మృత్యువాత పడుతున్నాయి. ఈ చలి గాలులు, మంచు తీవ్రత మరికొద్ది కాలం కొనసాగితే 50 నుంచి 70 శాతం మేర రొయ్య పిల్లలు మృత్యువాత పడతాయని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.