‘వెనామీ’పై చలి పంజా
చలికి మేత తినక తగ్గిన పెరుగుదల
ఆందోళనలో ఆక్వారైతు
తోటపల్లిగూడూరు : ప్రస్తుతం తీర గ్రామాల్లో సాగులో ఉన్న వెనామీ రొయ్య చలికి వణుకుతోంది. సాధారణంగా శీతల పరిస్థితులను వెనామీ తట్టకోవడం కష్టం. వారం రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి, మంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతుంది. కొంత కాలంగా వెనామీ రొయ్య గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇటీవల వాయుగుండాలు, భారీ వర్షాలు, చలిగాలులు వరుస పెట్టాయి.
ఈ క్రమంలో చలిగాలులు ఉధృతం కావడంతో ప్రస్తుతం సాగులో ఉన్న నెల లోపు వెనామీ రొయ్యలు చలికి తట్టకోలేక, మేత తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. గుంతలపై మంచు తెరలు ఉదయం 10 గంటలకు కూడా తొలగడం లేదు. చలి తీవ్రతకు రొయ్య పిల్ల సరిపడినంత మేత కూడా తీసుకోలేక పెరుగుదలలో లోపం కన్పిస్తోంది. చలికి కొన్ని పిల్లలు గుంతల్లోనే మృత్యువాత పడుతున్నాయి. ఈ చలి గాలులు, మంచు తీవ్రత మరికొద్ది కాలం కొనసాగితే 50 నుంచి 70 శాతం మేర రొయ్య పిల్లలు మృత్యువాత పడతాయని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.