సాక్షి, విశాఖపట్నం: చలితో వణుకుతున్న రాష్ట్ర ప్రజలకు ఒకింత వెచ్చని వార్త! కొన్నాళ్ల నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో చలి ప్రభావంతో జనం ఒకింత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఆకస్మికంగా మార్పు చోటు చేసుకుంది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత అధికంగా ఉండడం, అటు నుంచి ఉత్తర గాలులు రాష్ట్రం వైపు వీయడంతో ఇక్కడ చలి ప్రభావం కనిపించింది. కానీ ఇప్పుడు ఉత్తరగాలులు తగ్గుముఖం పట్టాయి. వాటి స్థానంలో ఈశాన్య, తూర్పు గాలులు వీయడం మొదలెట్టాయి. దీంతో నిన్న మొన్నటిదాకా సాధారణంకంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదైన రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలి తగ్గడం మొదలైంది.
ఉత్తరాదిలో పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) పశ్చిమ నుంచి తూర్పు దిశగా పయనిస్తుండడం వల్ల గాలులు మారడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సంక్రాంతి నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాక ఉత్తరం వైపుకు మళ్లుతాడు. దీంతో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ప్రారంభమవుతుందని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఇకపై రానురాను చలి తగ్గుతుందన్నారు. కాగా శుక్రవారం రాష్ట్రంలో అత్యల్పంగా జంగమహేశ్వరపురం, కళింగపట్నంలో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణంకంటే 2-3 డిగ్రీలు అధికంగా రికార్డయ్యాయి.
15న ఈశాన్య పవనాల ఉపసంహరణ
మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఈనెల 15తో నిష్క్రమించనున్నాయి. ఏటా అక్టోబర్ 18-22 తేదీల మధ్య ఈశాన్య పవనాలు రాష్ట్రాన్ని తాకుతాయి. కానీ ఈ ఏడాది ఇవి నిర్ణీత సమయంకంటే వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కానీ ఈసారి దక్షిణ తమిళనాడులో ఒక మోస్తరు వర్షాలు కురిపించాయి తప్ప దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం ఏమంత ప్రభావం చూపలేదు.
ఈశాన్య రుతుపవనాల సీజనులో 3-4 వాయుగుండాలు గాని 2-3 తుపాన్లు గాని ఏర్పడుతుంటాయి. కానీ ఈ సీజనులో రెండు వాయుగుండాలు ఏర్పడినా భారీ వర్షాలు కురిపించలేదు. అలాగే అవి బలపడి తుపాన్లుగానూ మారలేదు. ఈనెల 15తో ఈశాన్య రుతుపవనాల ఉపసంహరణ పూర్తవుతుంది. దీంతో ఇక ఇప్పట్లో రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment