collabration
-
నార్త్ టెక్సాస్ వర్సిటీతో వీఆర్ సిద్ధార్థ ఒప్పందం
కానూరు(పెనమలూరు) : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌తో సరస్పర సహాయ సహకారాలపై కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వీఆర్ సిద్ధార్థ కాలేజీలో శుక్రవారం ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ బారెంట్ బ్రియంట్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్సుల వివరాలు తెలియజేశారు. ఐదేళ్లకే బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చన్నారు. డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ విద్య అభ్యసించవచ్చని చెప్పారు. స్కాలర్షిప్స్, రీసెర్చ్ వివరాలు కూడా వివరించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మలినేని రాజయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, డీన్ డాక్టర్ పి.పాండురంగారావు, కంప్యూటర్స్ విభాగాధిపతి శ్రీనివాసరావు, రీసెర్చ్ డీన్ శాస్త్రి, ప్రొఫెసర్ రామ్ దంతు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం సహకారంతో అభివృద్ధి: దత్తాత్రేయ
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు గనుల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ తాను కలసినప్పుడు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరో మంత్రి జవదేకర్ బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 7,300 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం సహకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతులు ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. 13వ ఫైనాన్స్ కమిటీ ద్వారా తెలంగాణకు 3,139.46 కోట్లు రావాల్సి ఉండగా అందులో రూ. 1,112 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ. 2,027. 45 కోట్లు త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.