మమతపై హత్య కేసు నమోదు చేయాలి
కోలకతా: కోలకతా లో ఫ్లై ఓవర్ కూలిన ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ తన దాడిని ఎక్కుపెట్టింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనకు ఈ ఘటనే తార్కాణమని బీజేపీ మండిపడింది పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాష్ విజయ వార్గీయ ఫ్లై ఓవర్ కూలిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత ప్రభుత్వం అవినీతి పాలనకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ట్విట్ చేశారు. కైలాష్ విజయ వార్గీయ.. తన వరుస ట్విట్లలో మమత పై విరుచుకుపడ్డారు.
ఈ సంఘటనపై మమతపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె అవినీతి వల్ల అమాయక ప్రజలను బలి తీసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మృతులకు సంతాపం తెలిపిన కైలాష్ విజయ వార్గీయ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అటు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడం బాధ గలిగించిందని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్విట్ చేశారు. సహాయక చర్యల్లో సహకరించాల్సిందిగా పార్టీ రాష్ట శాఖ పార్టీకి ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు.కాగా ఉత్తర కోల్కతాలోని గణేశ్ థియేటర్ గిరీశ్ పార్క్ ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.