పరిశ్రమల స్థాపనకు చర్యలు
తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నా పారిశ్రామికపరంగా వెనుకబడి ఉందని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. స్థానిక శశి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘పశ్చిమలో పారిశ్రామికాభివృద్ధి అవకాశాలు–సీఐఐ మార్గదర్శకత్వం’ అంశంపై పారిశ్రామిక ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో పశ్చిమ పారిశ్రామికపరంగా వెనుకపడి ఉందన్నారు. వ్యవసాయం, ఉద్యాన, మత్స్య సంపద విషయంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలో మరే ఇతర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లేకపోవడం బాధాకరమన్నారు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో భూములపై లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. బ్యాంకుల అధిక వడ్డీలు పరిశ్రమల స్థాపనకు మోకాలొడ్డుతున్నాయన్నారు. అయినా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలను సరళీకతం చేస్తామని కలెక్టర్ చెప్పారు.
సవాళ్లను ఎదుర్కొంటేనే మనుగడ.. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్రమల జీవిత ప్రమాణం 56 ఏళ్లు ఉండగా ప్రస్తుతం 15 ఏళ్లకు తగ్గిపోయిందన్నారు. రానురాను ఈ స్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లిన రోజే పరిశ్రమలకు మనుగడ ఉంటుందన్నారు.
పరిశ్రమల పాత్ర కీలకం.. జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకుడు వి.ఆదిశేషు మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, ఉపాధిలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలో 2.60 కోట్ల యూనిట్ల ద్వారా 6.90 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, వీటిలో 45 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఉన్నాయన్నారు. 2015–20కు గాను ప్రభుత్వం పాలసీని ప్రకటించిందని, వీటిని వినియోగించుకుని పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలను స్థాపనకు ముందుకు రావాలని కోరారు.
శశి ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్, సీఐఐ విజయవాడ జోన్ అధికారి జి.వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.