దయ చూపించండి సారూ
ఏలూరు (మెట్రో) : ఆరేళ్లుగా ఆ దంపతులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. అప్పట్లో వయసు లేదన్నారు.. వయసు వచ్చాక రేషన్ కార్డు కావాలన్నారు.. తీరా అన్నీ సమకూర్చుకుంటే ఆధార్ అనుసంధానం కావడం లేదంటున్నారంటూ ద్వారకాతిరుమలకు చెందిన నార్కేడుమిల్లి బ్రహ్మానందరావు, స్వరాజ్యలక్ష్మి దంపతులు దివ్యాంగుడైన కుమారుడిని తీసుకుని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. తమ కుమారుడిపై జాలి చూపి పెన్షన్ మంజూరు చేస్తారని కోటి ఆశలతో వచ్చి ‘మీ కోసం’లో కలెక్టర్ భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించినా మరోమారు అవే మాటలు అధికారుల నుంచి వినిపించాయని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గతంలో పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ అధికారులు చెప్పారని, మండలస్థాయిలో నాయకులు, ఎంపీడీవోలు కూడా అదే చెప్పారని, ప్రస్తుతం మీ కోసం కార్యక్రమంలోనూ డీఆర్డీఏ అధికారులకు కలెక్టర్ సూచించారన్నారు. ఇప్పటిౖకైనా తన కుమారునికి పెన్షన్ మంజూరు చేస్తే కనీసం మందులు కొనుగోలుకైనా సహాయం చేసినవారవుతారని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు.