ఓటు వజ్రాయుధం
నెల్లూరు(అర్బన్): ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రధానమైన విషయమని కలెక్టర్ జానకి అన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు మందిపైగా జనభా ఉండగా, వీరిలో 75 శాతంపైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1022 మంది మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటరు నమోదు కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని తెలిపారు.
ఓటరుగా నమోదు చేసుకోకడమే కాకుండా ఓటు వేయడం, మంచి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనవన్నారు. అమెరికాలో స్వాతంత్య్రం వచ్చిన 200 సంవత్సరాలకు ప్రజలకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. మన దేశంలో మాత్రం స్వాతంత్య్రం వచ్చిన వెంటనే అందరికీ చాలా సులువుగా ఓటు హక్కు కల్పించారన్నారు. జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌లో చాలా మార్పులు వస్తున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావడం ఎంతో సులవన్నారు.
ఈ ఐదేళ్లు ఓటరుగా నమోదు, సవరణలు చేసుకునే అవకాశాలను ఎన్నికల కమిషన్ కల్పిస్తోందన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ దేశ పౌరులుగా చెప్పుకోవడానికి ప్రథమ గుర్తింపు కార్డు ఓటరు కార్డన్నారు. చాలా దేశాల్లో ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందని, మన దేశంలో సులువుగా ఇస్తారు కాబట్టి దీని విలువ చాలా మందికి తెలియడం లేదన్నారు. అర్బన్ ఓటర్ల ఓటింగ్ తగ్గుతోందని, ఓటు వేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు.
ఏజేసీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కనిపించడంలేదని, నూరు శాతం ఓటింగ్ నమోదు అయితే ఎవరో మంచి నేత తెలుస్తుందన్నారు. 18 ఏళ్లు నిండిన వాళ్లు బీఎల్ఓ (బూత్ లెవల్ అధికారి) వద్ద ఓటరుగా నమోదు కావాలని, అలాగే సవరణలు వాళ్ల దృష్టికి తీసుకెళ్లొచ్చని చెప్పారు. డీఆర్ఓ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగస్తులు ఒక చోట నుంచి వేరే చోటుకు వెళ్లిన తర్వాత ఓటు హక్కు కూడా మారుతుందిలే అనుకుంటున్నారని, దరఖాస్తు చేసుకుంటేనే మారుతుందని తెలిపారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్. బ్రహ్మ సందేశాన్ని స్క్రీన్ మీద ప్రదర్శించి ప్రేక్షకులకు చూపించారు. వెటరన్ ఓటర్లను శాలువాతో సన్మానించారు. నూతనంగా ఓటు హక్కు పొందిన వాళ్లకు ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు.అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తొలుత కలెక్టర్ అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. నెల్లూరు ఆర్డీఓ సుబ్రమణేశ్వరరెడ్డి, నెల్లూరు డిప్యూటీ ఈఓ షాం అహ్మద్ పాల్గొన్నారు.