comedian brahmanandam
-
రెండు పూటలు తినడానికి కూడా లేదు, ఆర్థిక ఇబ్బందులు: బ్రహ్మానందం
నవ్వినంత ఈజీ కాదు నవ్వించడం.. కానీ కమెడియన్లు రకరకాల డైలాగులతో, స్కిట్లతో, పంచులతో, చేష్టలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. సింగిల్ డైలాగ్ లేకుండా కేవలం హావభావాలతోనూ నవ్వించగల దిగ్గజ నటుడు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను హాస్యబ్రహ్మ అని పిలుస్తారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలే చేసిన ఆయన రంగమార్తాండలో వైవిధ్యమైన పాత్ర పోషించాడు. బ్రహ్మీని ఇలా చూడటం కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్. తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నా జీవితంలో జరుగుతున్నదేదీ ముందుగా ఊహించలేదు. రెండు పూటలా తినడానికి కూడా ఆలోచించుకున్న రోజులున్నాయి. అటువంటిది ఎమ్ఏ చదివాను, లెక్చరర్ ఉద్యోగం చేశాను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను. ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతకుముందు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాక పేరు కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. కానీ తమ కన్నా బాగుండాలని మాత్రం కోరుకోరు. నేను స్టార్ హీరోలందరితోనూ పనిచేస్తూ ఎదుగుతున్నప్పుడు చాలామంది అసూయపడ్డారు. సుధాకర్ వచ్చాడు బ్రహ్మానందం పనైపోయింది, బాబూ మోహన్, ఎల్బీ శ్రీరామ్ వచ్చారు.. ఇక బ్రహ్మీ పనైపోయినట్లే, పృథ్వీ వచ్చాడు బ్రహ్మీ వెనకబడిపోయాడు.. ఇలా కొత్తగా ఏ కమెడియన్ వచ్చినా సరే నా పనైపోయింది అన్నారు. ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. రంగమార్తాండ సినిమాలో ఆ పాత్ర మీరు తప్ప ఇంకెవరు చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు. నాకది చాలు' అని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం. -
బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Comedian Brahmanandam Assets, Net Worth: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.. కామెడీకి కేరాఫ్ అడ్రస్. తెరమీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు విరబూస్తాయి. ఆయన పేరు తలుచుకున్నా సరే పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన బ్రహ్మానందం తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో చక్కిలిగింతలు పెట్టిస్తారు. అందుకే ఈమధ్య ఆయన సినిమాలు తగ్గించినా సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్ అసామాన్యమైంది. ఎందుకంటే బ్రహ్మీ లేని మీమ్స్ ఊహించడం కూడా కష్టమే. ఆయన స్టైల్లో చెప్పే డైలాగులు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఇండస్ట్రీలో కామెడీ కింగ్‌గా సుమారు 1250కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 2010 లో గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. సినిమా ఎలాంటిదైనా అందులో బ్రహ్మీ మార్క్ ఖచ్చితంగా కనపడుతుంది. అందుకే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుదన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిబడి పెట్టిన బ్రహ్మానందం ఆస్తుల విలువ సుమారు రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. -
కోర్కెలు ఠక్కున తీర్చే దేవుడాయన : బ్రహ్మానందం
► బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండం ► ∙సాక్షితో సినీ హాస్యనటుడు బ్రహ్మానందం తిరుపతి : ‘ఏటా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నిజం చెప్పాలంటే ఇంకా నాలుగు కళ్లు కావాలి. ఆ బ్రహ్మాండ నాయకుని వైభవం చూడాలంటే బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే. ఎంతో విశేషమైన గరుడోత్సవం రోజున స్వామి వారిని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఏదీ ఎక్కడ సాధ్యమవుతుంది.? ఆ రోజొచ్చే సరికి ఏవో ఒక అత్యవసర పనులు. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ ఆ అదృష్టం అందరికీ రాదు’ అని.. ప్రఖ్యాత సినీ హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తిరుమలలో జరిగే స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తిరుమల సందర్శన సందర్భంగా గతంలో ఆయన పొందిన అనుభూతుల గురించి ఫోన్లో ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘‘పూర్వం నెలకొకసారి చొప్పున ఏడాదికి పన్నెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవని విన్నా.. రానురాను అవి ఏడాదికోసారి జరిగే విశేషమైన ఉత్సవాలుగా మారాయి. ముక్కోటి దేవలందరూ చేరి బ్రహ్మాండనాయకుని ముక్తకంఠంతో స్తుతించి, వేడుకగా జరిపే ఉత్సవాలివి. భక్తులందరూ ప్రత్యక్షంగా వీక్షించాల్సిన అవసరం ఉంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కో ఉత్సవంలో వేంకటేశుని దివ్వ తేజోమూర్తి వైభవం ఒక్కో విధంగా గోచరిస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ వారి మది నిండా భక్తి పారవశ్యాన్ని నింపుతున్నారు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవితో శ్రీనివాసుడి పెళ్లి జరిగింది. వేంకటాచల మహత్యం చదువుతుంటే ఆనాటి స్వామివారి పరిణయోత్సవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అన్నమయ్య, వెంగమాంబ వంటి పుణ్యమూర్తులు దేవదేవుడిని కీర్తించి చరితార్థులుగా మిగిలిపోయారు. సప్తగిరుల్లో కొలువైన వెంకన్నను దర్శించడం, లడ్డూ ప్రసాదాన్ని తినడం ఎప్పటికీ మరిచిపోలేని తీయటి అనుభూతి’ అన్నారు. చాలాసార్లు స్వామివారిని దర్శించా. కోరిన కోర్కెలు ఠక్కున తీర్చే దేవుడాయెన. అందుకే వీలు దొరికినప్పుడల్లా తిరుమల వెళ్లి వస్తుంటా. భక్తులకు నేను చెప్పేది ఒక్కటే.. భగవంతుడిని ఎలా ప్రార్థించినా, ఏ విధంగా ఆరాధించినా కరుణిస్తారు. కళ్లు మూసుకుని ఉంటే ధ్యానంలో దేవుడిని చూడు. కళ్లు తెర్చుకుని ఉంటే నీ ఊహల సృ జనాత్మకత లో ఆయన్ని చూడు. మనస్సు ప్రశాంత పడుతుంది’ అని కామెడీ లెజెండ్ బ్రహ్మానందం పేర్కొన్నారు.