కోర్కెలు ఠక్కున తీర్చే దేవుడాయన : బ్రహ్మానందం
కోర్కెలు ఠక్కున తీర్చే దేవుడాయన : బ్రహ్మానందం
Published Thu, Oct 13 2016 9:52 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
► బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండం
► ∙సాక్షితో సినీ హాస్యనటుడు బ్రహ్మానందం
తిరుపతి : ‘ఏటా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నిజం చెప్పాలంటే ఇంకా నాలుగు కళ్లు కావాలి. ఆ బ్రహ్మాండ నాయకుని వైభవం చూడాలంటే బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే. ఎంతో విశేషమైన గరుడోత్సవం రోజున స్వామి వారిని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఏదీ ఎక్కడ సాధ్యమవుతుంది.? ఆ రోజొచ్చే సరికి ఏవో ఒక అత్యవసర పనులు. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ ఆ అదృష్టం అందరికీ రాదు’ అని.. ప్రఖ్యాత సినీ హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తిరుమలలో జరిగే స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తిరుమల సందర్శన సందర్భంగా గతంలో ఆయన పొందిన అనుభూతుల గురించి ఫోన్‌లో ‘సాక్షి’తో ముచ్చటించారు.
‘‘పూర్వం నెలకొకసారి చొప్పున ఏడాదికి పన్నెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవని విన్నా.. రానురాను అవి ఏడాదికోసారి జరిగే విశేషమైన ఉత్సవాలుగా మారాయి. ముక్కోటి దేవలందరూ చేరి బ్రహ్మాండనాయకుని ముక్తకంఠంతో స్తుతించి, వేడుకగా జరిపే ఉత్సవాలివి. భక్తులందరూ ప్రత్యక్షంగా వీక్షించాల్సిన అవసరం ఉంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కో ఉత్సవంలో వేంకటేశుని దివ్వ తేజోమూర్తి వైభవం ఒక్కో విధంగా గోచరిస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ వారి మది నిండా భక్తి పారవశ్యాన్ని నింపుతున్నారు.
ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవితో శ్రీనివాసుడి పెళ్లి జరిగింది. వేంకటాచల మహత్యం చదువుతుంటే ఆనాటి స్వామివారి పరిణయోత్సవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అన్నమయ్య, వెంగమాంబ వంటి పుణ్యమూర్తులు దేవదేవుడిని కీర్తించి చరితార్థులుగా మిగిలిపోయారు. సప్తగిరుల్లో కొలువైన వెంకన్నను దర్శించడం, లడ్డూ ప్రసాదాన్ని తినడం ఎప్పటికీ మరిచిపోలేని తీయటి అనుభూతి’ అన్నారు. చాలాసార్లు స్వామివారిని దర్శించా. కోరిన కోర్కెలు ఠక్కున తీర్చే దేవుడాయెన. అందుకే వీలు దొరికినప్పుడల్లా తిరుమల వెళ్లి వస్తుంటా. భక్తులకు నేను చెప్పేది ఒక్కటే.. భగవంతుడిని ఎలా ప్రార్థించినా, ఏ విధంగా ఆరాధించినా కరుణిస్తారు. కళ్లు మూసుకుని ఉంటే ధ్యానంలో దేవుడిని చూడు. కళ్లు తెర్చుకుని ఉంటే నీ ఊహల సృ జనాత్మకత లో ఆయన్ని చూడు. మనస్సు ప్రశాంత పడుతుంది’ అని కామెడీ లెజెండ్ బ్రహ్మానందం పేర్కొన్నారు.
Advertisement
Advertisement