బ్రహ్మోత్సవాలకు 7 లక్షల లడ్డూలు
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవ పనుల కోసం రూ.8 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్ల ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయి. గోపురాలకు వెల్లవేశారు. తిరు వీధుల్లో రంగవల్లులు వేశారు. ఆలయానికి దేదీప్యమానంగా భారీ విద్యుత్ అలంకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈసారి ఎల్‌ఈడీ బల్పులతో సెట్టింగుల సంఖ్యను పెంచారు.
బ్రహోత్సవాల్లో భక్తులకు అందించేందుకు 7 లక్షల లడ్డూలు సిద్దం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని విభాగాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రస్తుతం ఆలయంతో పాటు నిత్యాన్నప్రసాదం, కల్యాణకట్ట, ఇతర ముఖ్య కూడళ్లలో 650 పైచిలుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సుమారు 2,400 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, మరో 3 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యిమందిని నియమించనున్నారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులూ తిరుపతి, తిరుమల మధ్య రెండు ఘాట్ రోడ్లను 24 గంటలూ తెరిచి ఉంచి వాహనాలు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. 27వ తేదీ రాత్రి గరుడ వాహన సేవ నేపథ్యంలో 26న అర్థరాత్రి నుంచి 28 వరకు కొండపైకి ద్విచక్రవాహనాలకు అనుమతి రద్దు చేశారు.
ప్రత్యేక ఆకర్షణ కానున్న శ్రీవారి సైకత శిల్పం
బ్రహ్మోత్సవాల్లో భక్త కోటికి సైకత శిల్పం కనువిందు చేయనుంది. ఇక్కడి కల్యాణ వేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పం దర్శనమివ్వనుంది. దశావతారాల్లోని మత్స్య(నృసింహ), వామన అవతారంలో ఏదో ఒక సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించారు.