రేపు సత్యసాయి ఆరాధనోత్సవం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి ప్రశాంతి నిలయం కేంద్రంగా ఈనెల 24న భగవాన్ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి సత్యసాయి సెంట్రల్ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోన్న పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద వెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యనారాయణరాజుగా పిలువబడే సత్యసాయిబాబా జన్మించారు.
చిన్న నాటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో గడిపిన ఆయన 1940లో తన 14వ యేట సత్యసాయిబాబాగా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి ఏకరూప వస్త్రధారి అయిన ఆయన దేశ,విదేశాలు సంచరిస్తూ మానవతా విలువలు, ఆధ్యాత్మికతను బోధిస్తూ తన ప్రేమ సామ్రాజ్యాన్ని సుమారు 180 దేశాల్లో నెలకొల్పారు. తక్కువ కాలంలోనే పుట్టపర్తికి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చారు. దీంతో నిత్యం విదేశీయులు వేలాదిగా పుట్టపర్తికి విచ్చేస్తుంటారు.
అపర భగీరథుడు సత్యసాయిబాబా :
భక్తులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్య వైద్యం, తాగునీళ్లు,ఉచిత భోజన వసతి అందిస్తున్నారు. వరుస కరువులతో గుక్కెడు నీళ్లు దొరకని వందలాది గ్రామాల్లో తాగునీరు అందించి అపర భగీరథుడయ్యారు. 2011 ఏప్రిల్ 24న సత్యసాయి శివైక్యం పొందారు. ఆ తర్వాత నుంచి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చెన్నై నగరానికి కూడా తాగునీళ్లు అందించారు.
రెండేళ్ల క్రితం సుమారు రూ.100 కోట్లతో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు తాగునీటి వసతి కల్పించారు. ఇక పేదలను నయాపైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. పుట్టపర్తిలో డీమ్డ్ యూనివర్సిటీ నెలకొల్పి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యసాయి సేవలు అనితర సాధ్యమైనవని భక్తులు చెప్పుకుంటున్నారు. యేటా ఏప్రిల్ 24న పుట్టపర్తిలో వైభవంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.