అమరుల కుటుంబాలకు అండ
-
డీఎఫ్‌ఓ భీమానాయక్
-
ఘనంగా అటవీ అమరుల సంస్మరణ దినో త్సవం
హన్మకొండ అర్బన్ : అటవీ సంపదను కాపాడే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని అటవీశాఖ ఉత్తర మండలం అధికారి భీమానాయక్ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినో త్సవాన్ని హన్మకొండలోని అటవీశాఖ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ భీమానాయక్ అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కబ్జాదారులు అటవీభూములను కూడా ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. అటవీ జంతువులవేట, కలప స్మగ్లింగ్ వంటి విషయాల్లో సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఉద్యోగులు సాహసాలకు పోకుండా అప్రమత్తంగా ఉండి అధికారుల సహకారంతో పనులు చేయాలన్నారు. మరణించిన ఉద్యోగులకు సంబంధించి కార్యాలయంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎంతోకాలంగా చర్చలకే పరిమితమవుతున్న అమరుల స్థూపం మూడు నెలల్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు. వన్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓ పురుషోత్తం మాట్లాడుతూ అటవీశాఖ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆత్మరక్షణతోపాటు అటవీ సంపదను కాపాడాలన్నారు. రేంజ్ అధికారుల స్థాయిలో సమస్యలపై చర్చించుకుని ఐకమత్యంగా ముందుకు వెళ్లాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓలు కిష్టాగౌడ్, కేశవరాం, ఎఫ్‌ఆర్‌ఓ చంద్రశేఖర్, వివిధ డివిజన్ల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.