హీరోగా ది బెస్ట్ అనిపించుకుంటా!
- బెల్లంకొండ శ్రీనివాస్
‘‘ఈ ఆరు నెలల్లో బోల్డన్ని కథలు విన్నాను. వాటిల్లో కొన్ని కథలు ఎంపిక చేశాం. ‘అల్లుడు శీను’తో హీరోగా నా రంగప్రవేశం భారీగా జరగడం, ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో నా తదుపరి చిత్రం కూడా దానికి దీటుగా ఉండాలనుకుంటున్నా. అందుకే కథ ఎంపిక కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను’’ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం కమర్షియల్ పంథాలో సాగుతుంది.
ఆ తరహా చిత్రాల్లో డాన్స్, ఫైట్స్కి బాగా ఆస్కారం ఉంటుంది. అందుకని, నా తదుపరి చిత్రాలు కూడా ఈ కోవలోనే ఉండాలని కోరుకుంటున్నాను. బోయపాటిగారు ఓ మంచి కమర్షియల్ కథ తయారు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం బాడీ బిల్డప్ చేశాను. డాన్స్, జిమ్నాస్టిక్స్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని చెప్పారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయనున్న చిత్రం గురించి శ్రీనివాస్ చెబుతూ -‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సుందర పాండియన్’కి ఇది రీమేక్. స్నేహం నేపథ్యంలో సాగే ఈ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలుస్తున్నారు’’ అని తెలిపారు.
కెరీర్ ప్రారంభంలో ఉన్నందు వల్ల సినిమాల ఎంపిక విషయంలో కొంచెం ఒత్తిడి ఉంటుందని చెబుతూ - ‘‘హీరోగా ‘ది బెస్ట్’ అనిపించుకోవాలన్నది నా తాపత్రయం. మరో మూడు, నాలుగు సినిమాల వరకూ సినిమాలు చేసే విషయంలో కొంచెం స్లోగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత వేగం పెంచుతా’’ అన్నారు. సినిమా సినిమాకీ నటనపరంగా వైవిధ్యం కనబర్చడానికి వంద శాతం కృషి చేస్తాననీ, తన లక్ష్యం అదేననీ చెప్పారు.