‘నవోదయ’= నాణ్యమైన విద్య
నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన నవోదయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా దేశంలోనే అగ్రస్థానంలో వెలుగొందుతున్నాయని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం నవోదయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏవై రెడ్డి మాట్లాడుతూ నవోదయ విద్యాలయాలు పాఠశాల స్థాయిలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నాయని చెప్పారు. నవోదయ విద్యాలయాలు ప్రతి జిల్లాలో పక్కా భవనాలు, మౌలిక వసతులు, యోగా, క్రీడలు, కంప్యూటర్, పోటీ పరీక్షల శిక్షణతో విద్యార్థుల సంపూర్ణ వికాసానాకి తోడ్పతున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో సేవలు అందిస్తున్నారని వివరించారు. ఫలితాల సాధనలో హైదరాబాద్ రీజియన్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. సమావేశంలో నవోదయ నేతృత్వ సంస్థ డైరెక్టర్ జంధ్యాల వెంకట రమణ, అసిస్టెంట్ కమిషనర్లు జి.అనసూయ, జగదీశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.