ఏం మాయ చేశారో!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత. దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇద్దరు వ్యక్తులు ఉద్యోగులుగా చలామణీ అవుతున్నారు. ఓ ఆలయ మేనేజర్ వారికి ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ల పేరుతో సర్వీసు రికార్డులు సృష్టించాడు. ఏడేళ్ల సర్వీసు తర్వాత పీఆర్సీ కూడా అమలు చేయించాడు.
వీరికి ప్రభుత్వం నెల నెలా ఠంఛనుగా జీతాలు చెల్లిస్తోంది. డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సహకరించడంతో ఈ వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా నడిచాయి. దొంగ ఉద్యోగులిద్దరికీ బదిలీ అయినప్పుడు 14 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపడింది. ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు జరపడంతో ఎన్నో విస్మయకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. వ్యవస్థలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేశాయి. దీంతో ముగ్గురిని విధుల నుంచి తొలగించి, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు.
- దేవాదాయశాఖలో దొంగ నియామకాలు
- 14 ఏళ్ల కిందటి అడ్డగోలు వ్యవహారం
- ఉన్నతాధికారులకు తెలియకుండా కథ నడిపించిన ఆలయ మేనేజర్
- సహకరించిన డీసీఓ సూపరింటెండెంట్
డాబాగార్డెన్స్(విశాఖ): దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకంలో అవకతవకలు బయటపడ్డాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్ తెలిపారు. సోమవారం టర్నర్ చౌల్ట్రీలో ఉన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ విషయమై రీజనల్ జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆయన వెల్లడించిన వివరాలు.. విశాఖపట్నం కంచరపాలెం బర్మా క్యాంపు జై భారత్‌నగర్‌లో ఉన్న నూకాంబిక అమ్మవారి దేవాలయంలో చెంబోలు శ్రీనివాసరావు మేనేజర్‌గా విధులు నిర్వహించేవాడు. 2001లో భక్త సమాజం సెక్రటరీ ద్వారా జి.సత్యనారాయణ అనే వ్యక్తిని రూ.వెయ్యి జీతానికి నియమించాడు.
ఎల్.వి.కృష్ణారావు అనే వ్యక్తిని కూడా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే అడ్డగోలుగా ఉద్యోగమిచ్చాడు. అంతేగాక 1993 పీఆర్సీ అమలు చేస్తూ 2008 నుంచి జి.సత్యనారాయణకు నెలకు రూ.16 వేలు,(ఫైల్ నెంబరు ఏ1/2084/08, తేది 2008 మే 25) ఎల్.వి.కృష్ణారావుకు నెలకు రూ.10 వేలు జీతంగా జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో పర్మినెంట్ చేశారు. వాస్తవానికి ఆ ఫైల్ నెంబరుతో యలమంచిలిలోని ఓ దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడిపై ఫిర్యాదు నమోదు చేసి ఉంది.
దేవాలయానికి మంజూరయ్యే నిధులతో వారికి జీతాలు చెల్లిస్తూ వచ్చిన ఆలయ మేనేజర్ చెంబోలు శ్రీనివాసరావు.. నిధుల కొరత వల్ల ఇబ్బందులు ఎదురై సూపరింటెండెంట్ సహాయంతో వారిద్దర్నీ భీమిలి లంగర్ ఖానా చౌట్రీకి, అనంతరం సంగివలస కొత్తఅమ్మవారి దేవాలయానికి బదిలీ చేసేశాడు. ఈ విషయాన్ని క్షుణంగా పరిశీలించి విచారిస్తే చెంబోలు బాగోతం బయటపడిందని సహాయ కమిషనర్ పుష్పవర్థన్ తెలిపారు. విచారణ అనంతరం ప్రాంతీయ సహాయ కమిషనర్ భ్రమరాంబకు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని, ఆమె సూచన మేరకు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ నెల 20న ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ అవకతవకలకు ప్రధాన బాధ్యుడైన చెంబోలు శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించి, సహకరించిన సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశామన్నారు. త్వరలోనే మరికొంతమంది జాబితాను వెల్లడిస్తామని సహాయ కమిషనర్ పేర్కొన్నారు.