రోడ్లపై చెత్తవేస్తే జరిమానా
- ఎవరి చెత్త వాళ్లే ఎత్తుకోవాలి
- స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం
- కమిషనర్ వీరపాండియన్
విజయవాడ సెంట్రల్ : పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎవరి చెత్త వాళ్లే ఎత్తుకునేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ సూచించారు. ఆదివారం వన్‌టౌన్, కాళేశ్వరరావు మార్కెట్, బీఆర్పీ రోడ్డు, కొత్తపేట, చిట్టినగర్, కేదారేశ్వరపేట, రైతుబజార్, మ్యాంగోమార్కెట్ హనుమాన్‌పేట, కృష్ణలంక, రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రోడ్లన్ని చెత్తమయమై ఉండటాన్ని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ సముదాయాలు, షాపింగ్ మాల్స్ నుంచి వచ్చే చెత్త, వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా ఉండేలా ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చించాల్సిందిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్‌కు సూచించారు.
మార్కెట్లోని షాపుల యజమానులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. లేనిపక్షంలో ప్రజారోగ్య చట్టం ప్రకారం సంబంధిత షాపుల యజమానుల నుంచి అపరాధ రుసుం విధించాలన్నారు. కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రజలు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చెత్త పడేయొద్దని కమిషనర్ సూచించారు. ఎవరికి వారు స్వచ్ఛంధంగా చెత్తను దగ్గర్లోని డంపర్‌బిన్స్‌లో వేయాల్సిందిగా సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా సూచించారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న పబ్లిక్‌హెల్త్ వర్కర్ల డిప్యుటేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించారు. పీహెచ్ వర్కర్లు అందరూ తప్పనిసరిగా పారిశుధ్య విధులు నిర్వర్తించాలన్నారు.