బాలింతను జుట్టుపట్టి ఈడ్చి..
- బట్టబయలైన ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు
- ఆమె వ్యవహారశైలిపై విచారణ కమిటీకి ఫిర్యాదుల వెల్లువ
- వేధింపులు తాళలేకే సంధ్యారాణి ఆత్మహత్యని తేల్చిన విచారణ కమిటీ
సాక్షి, అమరావతి/గుంటూరు: అప్పుడే పుట్టిన బిడ్డకు పాలిస్తున్న బాలింతను అసభ్య పదజాలంతో దూషిస్తూ జుట్టు పట్టుకుని మంచంపై నుంచి ఈడ్చి కింద పడేసింది.. నీ భర్త నీతో ఎలా కాపురం చేస్తున్నాడంటూ వికలాంగురాలైన స్టాఫ్ నర్సును తీవ్ర వేధింపులకు గురిచేసింది.. నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను నోటికొచ్చినట్లు తిట్టేది.. పెళ్లి కోసం సెలవు పెట్టిన డాక్టర్ సంధ్యారాణిని చెప్పలేని భాషలో తిడుతూ తన శాడిజాన్ని ప్రదర్శించింది. ప్రాణాలు కాపాడే ఉన్నత స్థానంలో ఉన్న ఓ వైద్య అధికారిణి ఇవన్నీ చేసిందంటే నమ్మక తప్పదు. ఆమె వేధింపులను బయటకు చెప్పుకోలేక తీవ్రంగా మధనపడుతున్నవారు కొందరైతే.. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేక మిన్నకుండిపోయినవారు మరికొందరు. చివరకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో భరించలేక పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. దీనిపై జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టడంతో ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసి విచారణ జరిపింది. ఈ సందర్భంగా వందలాది మంది లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
► జూలై 25న లాలాపేటకు చెందిన మౌనిక అనే బాలింత బిడ్డకు పాలిస్తూ ఉండగా.. ఆమె మూడేళ్ల పెద్ద కుమార్తె వార్డులో తిరుగుతోందనే కారణంతో మౌనికను లక్ష్మి జుట్టుపట్టి ఈడ్చి కింద పడేసి అసభ్య పదజాలంతో దూషించింది. దీనిపై మౌనిక భర్త విజయకుమార్ ఆర్ఎంవో రమేశ్, సూపరింటెండెంట్ రాజునాయుడుకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు సూపరింటెండెంట్ ఆదేశించారు. కానీ అప్పటికే మౌనిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు చూపి చర్యలు తీసుకోకుండా వదిలేశారు.
► కుంటిదానివైన నిన్ను నీ భర్త ఎలా పెళ్లి చేసుకున్నాడు.. ఉన్నాడా.. వదిలి వెళ్లిపోయాడా.. అంటూ గైనకాలజీ ఓపీ విభాగంలో పనిచేసిన వికలాంగురాలైన స్టాఫ్ నర్సును తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీంతో లక్ష్మిపై నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పకు ఆమె ఫిర్యాదు చేశారు. అంతా నిలదీయడంతో మరోసారి ఇలా జరగనివ్వనని చెప్పి లక్ష్మి తప్పించుకుంది. కానీ మళ్లీ అదే తరహాలో వేధింపులకు పాల్పడుతూనే ఉందని విచారణ కమిటీకి వంద మంది స్టాఫ్‌నర్సులు ఫిర్యాదు చేశారు. మరో 20 మంది పీజీ విద్యార్థులు, సుమారు 40 మంది నాల్గో తరగతి ఉద్యోగులు, జీజీహెచ్ వైద్యాధికారులు సైతం విచారణ కమిటీ ఎదుట లక్ష్మిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సహచర విద్యార్థినుల ముందు ఎంత అసభ్య పదజాలం వాడినా డా.సంధ్యారాణి ఓపికతోనే ఉండేదని, చివరకు ఆమె ఓపిక నశించి ఆత్మహత్యకు పాల్పడిందని కమిటీ తేల్చింది. ప్రొఫెసర్ వేధింపుల వల్లే సంధ్యారాణి మృతి చెందిందని నిర్ధారిస్తూ విచారణ కమిటీ ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా మంత్రి కామినేని శ్రీనివాస్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రకటించారు.
నివ్వెరపోతున్న కమిటీ సభ్యులు
ఇదిలాఉండగా, లక్ష్మి వ్యవహారశైలిపై పలువురు వెల్లడించిన విషయాలతో కమిటీ సభ్యులే నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. విచారణలోని పలు అంశాలను వైద్య విద్యా శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ‘‘ఒక వైద్యురాలు తీవ్ర అసభ్య పదజాలాన్ని వాడటం దారుణం. ప్రతి చిన్న విషయాన్ని కూడా భార్యాభర్తల లైంగిక విషయాలకు ముడిపెట్టడం, సెలవులు అడిగినా ఏం భర్తను చూడలేకపోతే ఉండలేవా? అంటూ తీవ్ర అసభ్య పదాలు వాడినట్టు తేలింది’’ అని చెప్పారు. ఒక అధ్యాపకురాలు, విద్యార్థి మధ్య ఈ తరహా వేధింపులు ఇప్పటివరకూ వినలేదని పేర్కొన్నారు.
లక్ష్మిని డిస్మిస్ చెయ్యండి.. ఆమె భర్తను తొలగించండి
తన భార్య చనిపోయినా న్యాయం జరగడం లేదంటూ మనోవేదన చెందిన డా.సంధ్యారాణి భర్త డాక్టర్ రవి కూడా ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతున్న విషయం తెలిసిందే. సంఘటన జరిగి 10 రోజులు దాటినా ప్రభుత్వం, పోలీసులు ఇంతవరకు లక్ష్మిని అరెస్టు చేయకపోవడంపై జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే లక్షి భర్త విజయసారథిని కూడా ఎంసీఐ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరారు. ప్రొ.లక్ష్మిని రక్షించేందుకు ఆయన ఉన్నతస్థాయిలో పావులు కదుపుతున్నాడని ఆరోపించారు. కాగా, ప్రొ.లక్ష్మిపై నివేదిక వచ్చినా.. ఇది కూడా చివరకు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులాగే అవుతుందేమోనని జూనియర్ వైద్యుల సంఘం అనుమానం వ్యక్తం చేసింది.