Commodity price
-
అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై ధరలు పెంచేస్తున్నాయి
న్యూఢిల్లీ: రసాయనాలు, కంటైనర్లు, కీలక ముడివస్తువులకు సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై అనిశ్చితిని సృష్టిస్తున్నాయని కెవిన్‌కేర్ సీఎండీ సీకే రంగనాథన్ వ్యాఖ్యానించారు. తద్వారా మరింత ఎక్కువ ధరలు చెల్లించేలా కస్టమర్లను బలవంతపెడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో దేశీయంగానే కుమ్మక్కయ్యే వారని ప్రస్తుతం ఇది సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోందని ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రంగనాథన్ చెప్పారు. ‘ఇప్పటివరకూ క్రూడ్ విషయంలోనే ఇలాంటివి కనిపించేవి. కొన్ని దేశాలు కుమ్మక్కయ్యేవి. కానీ ఇప్పుడు అధిక పెట్టుబడులు అవసరమయ్యే కంటైనర్లు, రసాయనాలు లేదా ఇతరత్రా ఏవైనా కీలక ముడి పదార్థాలను ప్రపంచంలో కేవలం కొంతమందే తయారు చేస్తున్నారు. వారంతా కుమ్మక్కవుతున్నారు. దీనితో పేద కస్టమర్లు భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది‘ అని పేర్కొన్నారు. మరోవైపు, డిజిటైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటి కారణంగా రాబోయే రోజుల్లో వ్యాపారాల ఫండమెంటల్స్‌లో గణనీయంగా మార్పులు రాబోతున్నాయని రంగనాథన్ తెలిపారు. -
మారుతి కూడా బాంబు పేల్చింది
సాక్షి, ముంబై: వరుసగా ఆటో కంపెనీలు తమ వాహనాల రేట్లను పెంచేస్తున్నాయి. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ బాటలో మరో ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా కూడా వినియోగదారులపై ధరల బాంబును పేల్చింది. వివిధ మోడళ్ల వాహనాల ధరలను పెంచుతున్నట్టు మారుతి బుధవారం ప్రకటించింది. ఈ నెల నుంచే తమ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వస్తువుల ధరలు, విదేశీ మారకం అనిశ్చితి, ఇంధన ధరల పెరుగుదల తదితర ప్రతికూల ప్రభావాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇంధన ధరలు, లాజిస్టిక్స్ వ్యయంతో పాటుగా విదేశీ మారకం రేటు కూడా సంస్థపై ప్రభావం చూపిందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎస్.ఎస్.కాల్సీ తెలిపారు. ఆయా మోడల్స్ ఆధారంగా ధర పెంపు ఉంటుందని చెప్పారు. కాగా ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో 800 మొదలుకొని సెడాన్ సియాజ్ మోడల్ వరకూ రకరకాల కార్లను అమ్ముతోంది. వీటి ధరలు రూ.2.51 లక్షలు - రూ.11.51 లక్షల వరకూ ఉన్నాయి. సెడాన్ సియాజ్ (మధ్య సైజ్) ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం రూ.11.51లక్షలుగా ఉంది. -
ధరలపై మరో పోరు
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా కలెక్టరేట్ ఎదుట జిల్లా స్థాయి ఆందోళన విశాఖపట్నం : చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు ఉద్యమించనుంది. ఇప్పటికే గత నెలలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వినూత్న నిరసనలతో హోరెత్తించిన పార్టీ శ్రేణులు ఈసారి జిల్లా కేంద్రమైన విశాఖలో ఆందోళనకు సిద్ధమయ్యారు. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు పార్టీ జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. తొలుత నగరంలోని సరస్వతి పార్కు నుంచి జగదాంబ జంక్షన్, కేజీహెచ్ అప్రోడ్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో సహా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ కమిటీలు బాధ్యులు, ఇతర ముఖ్యనేతలంతా ఈ ధర్నాలో పాల్గొనున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొనేలా పార్టీ జిల్లా కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నిత్యావసర ధరల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ధర్నా ద్వారా సర్కార్‌కు తెలియజెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పిలుపు నిచ్చారు. జిల్లా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.