ధరలపై మరో పోరు
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా
కలెక్టరేట్ ఎదుట జిల్లా స్థాయి ఆందోళన
విశాఖపట్నం : చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు ఉద్యమించనుంది. ఇప్పటికే గత నెలలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వినూత్న నిరసనలతో హోరెత్తించిన పార్టీ శ్రేణులు ఈసారి జిల్లా కేంద్రమైన విశాఖలో ఆందోళనకు సిద్ధమయ్యారు. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు పార్టీ జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. తొలుత నగరంలోని సరస్వతి పార్కు నుంచి జగదాంబ జంక్షన్, కేజీహెచ్ అప్‌రోడ్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌తో సహా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ కమిటీలు బాధ్యులు, ఇతర ముఖ్యనేతలంతా ఈ ధర్నాలో పాల్గొనున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొనేలా పార్టీ జిల్లా కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నిత్యావసర ధరల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ధర్నా ద్వారా సర్కార్‌కు తెలియజెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ పిలుపు నిచ్చారు. జిల్లా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.