బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా 26న జగన్ ధర్నా
విషజ్వరాల బాధితుల్ని ఆదుకోనందుకు నిరసనగా
25న మచిలీపట్నంలో ధర్నా
వెల్లడించిన వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి
సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.. లేకుంటే ఆందోళన తప్పదు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు కీలకమైన ప్రజాసమస్యలపై వరుసగా రెండు రోజులపాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ధర్నాలు చేయనున్నారు. పేద రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధానికోసం వారినుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఆర్‌డీఏ ప్రాంతంలో ఈ నెల 26న ఆయన ఒకరోజు ధర్నాకు పూనుకుంటున్నారు. కృష్ణా జిల్లా కొత్త మాజేరులో విషజ్వరాల బాధితుల్ని రాష్ట్రప్రభుత్వం ఆదుకోనందుకు నిరసనగా ఆయన ఈ నెల 25న మచిలీపట్నంలో ఒకరోజు ధర్నా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. భూసేకరణపై రైతుల్లో తీవ్ర ఆందోళన, అలజడి నెలకొన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకెళ్లడంపై జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఆయన నిర్ణయించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో జరగనున్న ఈ ఆందోళన కార్యక్రమాన్ని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 26న భూసేకరణ వ్యతిరేక ధర్నా వేదిక ఎక్కడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
బాబు పైశాచికత్వానికి నిదర్శనం..
రాజధాని నిర్మాణంకోసం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని రైతులనుంచి సమీకరించినట్లుగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మళ్లీ మూడువేల ఎకరాల్ని బలవంతంగా సేకరించాలని నిర్ణయించడం సీఎం చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనమని పార్థసారథి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, రైతుసంఘాలు, ప్రజలంతా బలవంతపు భూసేకరణ చేయొద్దని చెబుతున్నా చంద్రబాబు రైతుల్ని ఇబ్బందులకు గురిచేయాలని చేస్తున్నారంటే, అది ఆయన ప్రజా వ్యతిరేక, స్వార్థపూరిత, రాక్షస మనస్తత్వాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు.
మధ్యలో ప్రైవేటు ఆస్తులుంటే తప్పేంటీ?
రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ఆహ్వానించిన సింగపూర్, జపాన్ కన్సల్టెంట్లు నిర్దేశిం చిన విధంగా సీడ్‌క్యాపిటల్‌లో అసెంబ్లీ, సచి వాలయం ప్రధానంగా ఉంటాయని, వాటి మ ధ్యలో ప్రైవేటు ఆస్తులుంటే తప్పేమిటి? అని పార్థసారథి ప్రశ్నించారు. హైదరాబాద్ సచివాలయం, అసెంబ్లీకి మధ్యలో బోలెడన్ని ప్రైవే టు ఆస్తులున్నాయి కదా! అని గుర్తుచేశారు.
కాలం చెల్లనున్న ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని లాక్కుంటారా?
2013 భూసేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు మరో పదిహేను రోజుల్లో కాలం చెల్లనున్న తరుణంలో చంద్రబాబు కత్తిగట్టి దానినే అడ్డం పెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుంటున్నారని పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్ణయం మార్చుకోవాలని, లేకుంటే రైతులకు తమ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని ప్రకటించారు. కొత్తమాజేరులో విషజ్వరాలు సంభవించినా వాటిని అంగీకరించడానికే ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే మచిలీపట్నంలో ధర్నా చేస్తున్నామని ఆయన తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లాకలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా జరుగుతుందన్నారు.