నేడు వైఎస్ జగన్ ధర్నా
విజయవాడ : మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేయనున్నారు. చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో జ్వర మృతుల కుటుంబాలను ఆదుకోని ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన కుటుంబాల వారితో కలిసి ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాలో పాల్గొంటారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుషిత నీరు తాగి ఊరంతా జ్వరాల బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి కొత్తమాజేరు గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో తాగునీటి చెరువును, ఫిల్టర్‌బెడ్లను పరిశీలించారు.
ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను శుభ్రం చేయాల్సిన విషయంలో అంతులేని నిర్లక్ష్యం వహించిన అధికారుల తీరును ఈ సందర్భంగా తప్పుబట్టారు. రెండున్నర నెలలుగా గ్రామంలో విషజ్వరాలు విజృంభించి ప్రాణాలు తీస్తుంటే అధికార యంత్రాంగానికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మంగళవారం జరగనున్న ధర్నాలో పాలకుల తీరును ఆయన ఎండగట్టనున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైన పాలకుల తీరును ప్రశ్నిస్తూ.. మానవత్వం చూపని అధికార పార్టీ నేతల అమానవీయ చేష్టలను ఈ ధర్నాలో ప్రజలకు తెలియజేస్తారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు పాల్గొంటారు.
విజయవాడలో రాత్రికి బస
కేఎల్ యూనివర్సిటీ నుంచి వైఎస్ జగన్ నేరుగా విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
ఏపీయుడబ్ల్యుజే సభలకు హాజరు...
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యుజే) రాష్ట్ర మహాసభలకు మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్ హాజరవుతారు. కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలు, సామాజిక బాధ్యత తదితర అంశాలపై ప్రసంగిస్తారు.
రేపు భూసేకరణకు వ్యతిరేకంగా..
గాంధీనగర్ : రాజధాని తాము వ్యతిరేకం కాదని, అడ్డగోలుగా భూసేకరణ చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ స్పష్టం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేస్తున్న నేపథ్యంలో సోమవారం వేదిక స్థలాన్ని రఘురామ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 30 శాతం పైగా రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అడ్డగోలుగా ముందుకుపోతోందన్నారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్దారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్‌ఖాన్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజకుమార్, పాల్గొన్నారు.