‘హోదా’ కోసం సమరభేరి
నేడు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా ఇవ్వడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మరోసారి తన నిరసన గళాన్ని వినిపించబోతోంది. రాష్ట్రాన్ని విభజించే సమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై దాదాపు 15 నెలలవుతున్నా ఒక్క అడుగూ ముందుకు పడకపోగా ఈ విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ దోబూచులాడుతున్నాయి.
దీని ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళనతో ఈ అంశంపై తొలినుంచీ వివిధ మార్గాల్లో పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఇదే అంశంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఢిల్లీ గడ్డపై సోమవారం ధర్నా చేపడుతున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న జంతర్‌మంతర్(పార్లమెంటు వీధి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో) వద్ద చేపడుతున్న ఈ ధర్నాలో ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, క్రియాశీల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు.
ఈ ధర్నాకోసం వైఎస్సార్‌సీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జోరువాన కురుస్తున్న నేపథ్యంలో ధర్నా వేదిక నిర్మాణ పనులను సాయంత్రం నుంచి చేపట్టి రాత్రికల్లా పూర్తి చేశారు. పార్లమెంటు వీధి మొత్తం భారీ హోర్డింగులు, పార్టీ జెండాలతో నిండిపోయింది. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని హోర్డింగ్‌ల్లో రాశారు. వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటును పార్టీ నేతలు ధర్నాస్థలి వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీ చేరిన జగన్
ఇదిలా ఉండగా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు పార్టీనేతలు, కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిన రెండు ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రికి దేశ రాజధాని నగరానికి చేరాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది. సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ధర్నాస్థలి నుంచి పార్లమెంట్‌కు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించనున్నారు.‘హోదా’పై ఏరాష్ట్ర విషయంలోనైనా చట్టం చేశారా?
వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశంపై చట్టం చేయాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ సీపీ మండిపడింది. ఆదివారం రాత్రి ధర్నా స్థలిని పరిశీలించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ముఖ్య నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, తదితరులు జంతర్‌మంతర్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదన్న వెంకయ్య వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ‘వెంకయ్యనాయుడు పచ్చిగా మాట్లాడారు. గతంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను పార్లమెంటులో చట్టం చేసి ఇచ్చారా? వెంకయ్యనాయుడు అలా మాట్లాడడం సరికాదు. అలాంటప్పుడు ఆనాడు సభలో పదేళ్లు కావాలని ఎలా అడిగారు? ఈ దేశ చరిత్రలో కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయం..’ అని పేర్కొన్నారు.