భరోసా ఏదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజాదర్భార్.. సామాన్యుల వినతిపై సత్వర చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్వయంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కార చర్యలు చేపడతారు. జిల్లా ఉన్నతాధికారికే నేరుగా సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉండడంతో జిల్లా నలుమూలల నుంచి సామాన్యప్రజలు ప్రతిసోమవారం కలెక్టరేట్‌కు వస్తుంటారు. కానీ కొంతకాలంగా కలెక్టరేట్ ప్రజాదర్భార్ మసకబారుతోంది.
గత నాలుగైదు వారాలుగా కార్యక్రమంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొనకుండా కిందిస్థాయి అధికారులు హాజరవుతున్నారు. సమస్యలపై నిర్ణయం తీసుకునే అధికారులు కాకుండా ఇతర అధికారులు పాల్గొనడంతో అర్జీదారులు పెదవి విరుస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజాదర్భార్‌లో జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు, డీఎస్ఓ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. వారు కొంత ఆలస్యంగా రావడంతో అర్జీదారులు బయట నిరీక్షించాల్సి వచ్చింది. ప్రజాదర్భార్‌లో వినతులపై స్పందన కరువైందని, గత నాలుగు వారాలుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదంటూ సోమవారం పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.