సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్‌లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్‌తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది.
ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్‌లోని కీలక మిలటరీ బేస్‌నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్‌ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్‌కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది.