Commonwealth Parliamentary Conference
-
ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి
సాక్షి, ఢిల్లీ: జాతి నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం ఇచ్చినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అది సాకారం అవుతుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇటీవల ఉగాండాలోని కంపాలలో జరిగిన 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్న అనంతరం ఢిల్లీ చేరుకున్న స్పీకర్ సోమవారం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. 58 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న అన్ని పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని వివరించారు. నిరుద్యోగ సమస్య, దాని ప్రభావాలు, వాతావరణ మార్పు, బ్రెగ్జిట్, లైంగిక వేధింపుల నివారణ, స్పీకర్ల వ్యవస్థలో ఉన్న సవాల్లు, పార్లమెంటరీ వ్యవస్థలో పారదర్శకత వంటి అనేక అంశాలపై చర్చ జరిగిందన్నారు. జాతి నిర్మాణంలో, దేశ విధానపరమైన నిర్ణయాల్లో యువతకు భాగస్వామ్యం కల్పించాలని, వారి ఆలోచనలకు చోటు కల్పించే అవకాశాలు ఇవ్వాలని, అప్పుడే నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలమని సదస్సులో వెల్లడించినట్టు చెప్పారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అందులో యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ప్రవేశపెట్టారని, వీటి ద్వారా మూడు నెలల్లో 5 లక్షల మందికి ఉపాధి కల్పించిగలిగారని వివరించానన్నారు. దీనిపై సదస్సుకు హాజరైన ప్రతినిధులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇక ఈ విదేశీ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమర్థ నాయకత్వం, పారదర్శక పాలన, అపార అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆహ్వానించామని తెలిపారు. -
కామన్వెల్త్ వేదికపై ఏపీ స్పీకర్
ఉగాండాలో జరిగిన 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర శాసన సభాధిపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నిర్వహిస్తున్న తీరు, చట్టాల అమలుతోపాటు ఇటీవల ఆమోదం పొందిన పలు కీలక బిల్లుల విశేషాలను తన ప్రసంగంలో సవివరంగా తెలియజేశారు. సతీమణితో కలిసి వెళ్లిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఉగాండాలో నివసిస్తున్న తెలుగువారు స్పీకర్ దంపతులకు ఘన సన్మానం చేశారు. సాక్షి, శ్రీకాకుళం : ఉగాండాలో జరిగిన 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు (సీడబ్ల్యూసీ) ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. తమ్మినేనితోపాటు ఆయన సతీమణి వాణీసీతారాం కూడా వెళ్లారు. స్పీకర్ దంపతులకు ఉగండాలో కంపల ఎయిర్‌పోర్టులో అక్కడ ఎంపీ, ప్రొటోకాల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీలంక ఎంబసీ కమలనాథ్న్తోపాటు ఇండియన్ ఎంబసీతో కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. సీడబ్ల్యూసీ కాన్ఫరెన్స్‌లో సీతారాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నిర్వహిస్తున్న తీరు, చట్టాలు అమలుతోపాటు పలు కీలక బిల్లులపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. కామన్వెల్త్ సభ్య దేశాలు, రాష్ట్రాల నుంచి హాజరైన స్పీకర్లు, ముఖ్యులు పాల్గొని తమ అనుభవాలను, తమ ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న అనుభూతులను తెలిజేశారు. పలు కొత్త అంశాలు తెలుసుకుని రానున్న సమావేశాల్లో వాటిని అమలుచేసేందుకు ఇటువంటి ఎంతో సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉగాండాలో నివసిస్తున్న తెలుగువారు స్పీకర్ దంపతులకు సన్మానించారు. స్పీకర్ దంపతులు పలు ప్రాంతాలను తిరిగి అక్కడి ఆచారాలు, పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తున్న తీరును తెలుసుకున్నారు. -
స్పీకర్ తమ్మినేని సీతారాం విదేశీ పర్యటన
సాక్షి, అమరావతి : విదేశీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉగాండాలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 7వ తేదీ వరకు ఆ దేశంలో జరిగే 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు స్పీకర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో యువత, నిరుద్యోగిత, ప్రభుత్వ పాత్ర అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అనంతరం స్విట్జర్లాండ్, పారిస్‌లోనూ స్పీకర్ పర్యటించనున్నారు. -
కశ్మీర్ అసెంబ్లీని గుర్తించం: పాక్
ఇస్లామాబాద్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఇస్లామాబాద్‌లో జరగనున్న కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆహ్వానించే ప్రసక్తి లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. కశ్మీర్ అసెంబ్లీని చట్టబద్ధమైందిగా తాము గుర్తించట్లేదని, ఆమోదించట్లేదని పేర్కొంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల్లో ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, దాని అసెంబ్లీని పాక్ గుర్తించబోదని చెప్పారు. ఈ సదస్సుకు కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌ను కనుక ఆహ్వానించినట్లయితే.. కశ్మీర్‌పై పాక్ అనుసరిస్తున్న విధానం విషయంలో రాజీ పడినట్టే అవుతుందన్నారు. కాబట్టి ‘ఆక్రమిత జమ్మూకశ్మీర్’ అసెంబ్లీ స్పీకర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరు కావాలంటూ భారత్‌లోని ఇతర రాష్ట్రాల స్పీకర్లందరికీ ఆహ్వానం పంపిన పాకిస్తాన్.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం పంపలేదు. దీనిపై భారత్ ప్రతిస్పందిస్తూ.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ కవీందర్ గుప్తాకు ఆహ్వానం పంపకపోయినట్లయితే.. ఈ సదస్సును బహిష్కరిస్తామ హెచ్చరించింది.