కశ్మీర్ అసెంబ్లీని గుర్తించం: పాక్
ఇస్లామాబాద్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఇస్లామాబాద్‌లో జరగనున్న కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆహ్వానించే ప్రసక్తి లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. కశ్మీర్ అసెంబ్లీని చట్టబద్ధమైందిగా తాము గుర్తించట్లేదని, ఆమోదించట్లేదని పేర్కొంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల్లో ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, దాని అసెంబ్లీని పాక్ గుర్తించబోదని చెప్పారు.
ఈ సదస్సుకు కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌ను కనుక ఆహ్వానించినట్లయితే.. కశ్మీర్‌పై పాక్ అనుసరిస్తున్న విధానం విషయంలో రాజీ పడినట్టే అవుతుందన్నారు. కాబట్టి ‘ఆక్రమిత జమ్మూకశ్మీర్’ అసెంబ్లీ స్పీకర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరు కావాలంటూ భారత్‌లోని ఇతర రాష్ట్రాల స్పీకర్లందరికీ ఆహ్వానం పంపిన పాకిస్తాన్.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం పంపలేదు. దీనిపై భారత్ ప్రతిస్పందిస్తూ.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ కవీందర్ గుప్తాకు ఆహ్వానం పంపకపోయినట్లయితే.. ఈ సదస్సును బహిష్కరిస్తామ హెచ్చరించింది.