కామన్వెల్త్ కుంభకోణంలో ఐదుగురికి శిక్షలు ఖరారు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 2010 నాటి కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ఐదుగురికి శిక్షలు ఖరారుచేసింది. కుంభకోణం కింద నమోదయిన పలు కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు.. వీధి లైట్ల ఏర్పాట్లలో చోటుచేసుకున్న అవినీతికి సంబంధించిన కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కు చెందిన నలుగురు ఉన్నతోద్యోగులతోపాటు నాలుగేళ్ల సాధారణ జైలుశిక్ష, వీధి లైట్లు సరఫరా చేసిన సంస్థ ఎండీకి ఆరేళ్ల సాధారణ శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి శిక్షలు కరారు కావడం ఇదే ప్రధమం.
కామన్వెల్త్ క్రీడల కుంభకోణాన్ని దర్యాప్తు చేసిన సీబీఐ 2011లో దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం.. క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఢిల్లీ నగరంలో అప్పటికే ఉన్న వీధి లైట్లను తొలిగించి, వాటి స్థానంలో అధునాతన లైట్లను ఏర్పాటుచేయాలని క్రీడల కమిటీ నిర్ణయించింది. అయితే కీలక స్థానాల్లో ఉన్న నలుగురు ఎంసీడీ ఉన్నతాధికారులు.. ఉద్దేశపూర్వకంగా ధరలు తారుమారుచేసి, తమకు అనుకూలమైన సంస్థకు కాంట్రాక్టు దక్కేలా చేశారు. ఆ సంస్థ నాసిరకం లైట్లను ఏర్పాటుచేసింది. దీంతో రూ.1.42 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది.
సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలతో సంతృప్తిచెందిన కోర్టు.. నలుగురు ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు పొందిన సంస్థ ఎండీని దోషులుగా నిర్ధారించి, బుధవారం శిక్షలు ఖరారుచేసింది. కాగా, ఇప్పటికేవారు 11 నెలలు విచారణ ఖైదీలుగా జైలు జీవితం గడిపినందున శిక్షా కాలం నుంచి 11 నెలలను మినహాయించాలని కోర్టు సూచించింది. ఇక ఈ కుంభకోణంలో అసలు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేశ్ కల్మాడీ నిందితుడిగా ఉన్న కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.