ప్రీపెయిడ్ కరెంట్‌కు డెడ్‌లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ రంగ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పదునుపెట్టింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణే లక్ష్యంగా విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును ప్రకటించిన కేంద్రం.. బిల్లు ఆమోదానికి ముందే అందులోని లక్ష్యాల సాధన దిశగా చర్యలను వేగిరం చేసింది. విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గడువులను నిర్దేశిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కమ్యూనికేషన్ నెట్వర్క్ లభ్యత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు అంతర్జాతీయ ప్రమాణాల(ఐఎస్–16444) మేరకు కింద పేర్కొన్న గడువుల్లోగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
►అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, 50 శాతానికి మించి పట్టణ ప్రాంత వినియోగదారులను కలిగి ఉండి 2019–20లో 15 శాతానికి మించిన సాంకేతిక, వాణిజ్యపర(ఏటీఅండ్‌సీ) నష్టాలున్న విద్యుత్ డివిజన్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు.. 2023, డిసెంబర్ నాటికి ప్రీపెయిడ్ పద్ధతిలో విద్యుత్ సరఫరా చేయాలి. 2019–20లో 25 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన ఇతర విద్యుత్ డివిజన్లు, మండల(బ్లాక్), ఆపై స్థాయిల్లో కూడా ఇదే గడువులోపు అందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్కోసారి ఆరు నెలలకు మించకుండా నోటిఫికేషన్ ద్వారా రెండు పర్యాయాలు ఈ గడువు పొడిగించడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి అవకాశం కల్పించింది. అయితే దీనికి సరైన కారణాలు చూపాలి.
►ఇతర అన్ని ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడంతో పాటు ప్రీపెయిడ్ పద్ధతిలోనే విద్యుత్ సరఫరా చేయాలి.
►అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల సామర్థ్యానికి మించి అధిక మోతాదులో విద్యుత్ వినియోగించే వినియోగదారులకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) సదుపాయం గల స్మార్ట్ మీటర్లను బిగించాలి.
►అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల(డీటీ)కు ఈ కింద పేర్కొన్న గడువుల్లోగా ఏఎంఆర్/ఏఎంఐ సదుపాయం ఉన్న మీటర్లను ఏర్పాటు చేయాలి.
►2022, డిసెంబర్‌లోగా అన్ని ఫీడర్లకు మీటర్లు బిగించాలి.
►50 శాతానికి మించి పట్టణ వినియోగదారులు కలిగి ఉండి... 2019–20లో 15 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని అన్ని డీటీలకు, 2019–20లో 25శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని డీటీలకు డిసెంబర్ 2023లోగా మీటర్లు బిగించాలి.
►ఇతర అన్ని డివిజన్లలోని డీటీలకు 2025 మార్చిలోగా మీటర్లు ఏర్పాటు చేయాలి.
►25కేవీఏ కన్నా తక్కువ సామర్థ్యం గల డీటీలు, హెచ్‌వీడీఎస్‌లకు పైన పేర్కొన్న గడువుల నుంచి మినహాయింపు.