పోలీసుల అదుపులో ముధోల్ నిందితులు?
(ముధోల్ నుంచి మురళీగౌడ్, సాక్షి)
ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఘటనలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేయించారు. సంఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 8 మంది నిందితులను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ముధోల్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఓవర్గానికి చెందిన ప్రార్థన మందిరం అపవిత్రం అయ్యిందన్న ఆరోపణలు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. వెంటనే బాధ్యులను అరెస్టు చేయాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దీంతో చుట్టుపక్కల మూడు నాలుగు మండలాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు.సంఘటన స్థలానికి భైంసా డీఎస్పీ గిరిధర్ కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పరిస్థితిని ఎలా అదుపు చేయాలన్న విషయమై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోనే భైంసా పట్టణంలో ఇలాగే మతఘర్షణలు జరిగాయి. అప్పట్లో అవి తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యాయి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.