కాలేజీ కోసం మంత్రి పల్లె vs జేసీ
వ్యవసాయ కాలేజీ కోసం 117 ఎకరాల కొనుగోలు
ఎకరా రూ.1.50 లక్షలతో మొత్తం రూ.1.72 కోట్లు చెల్లించినట్లు రిజిస్ట్రేషన్
వాస్తవానికి అక్కడ ఎకరా రూ.15 - 20 లక్షలు
కాలేజీ అంశంలో ‘పల్లె’తో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీ
తిమ్మనచెరువులో ఏర్పాటుకు పావులు కదుపుతున్న వైనం
అనంతపురం : రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు వ్యవసాయ కాలేజీలు, 39 అగ్రి పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో నాలుగు వ్యవసాయ కాలేజీలు, పది పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అంగీకరించింది. ప్రస్తుతం శ్రీకాకుళం, తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు నడుస్తున్నాయి.
తాజాగా ప్రకటించిన నాలుగు కాలేజీలు తక్కిన జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒక కాలేజీ కోసం మంత్రి పల్లెరఘునాథరెడ్డితో పాటు జేసీ బ్రదర్స్ తీవ్రంగా పోటీపడుతున్నారు. వ్యవసాయ కాలేజీ స్థాపించాలంటే వంద ఎకరాలకు తక్కువ లేకుండా భూములు ఉండాలి. పెద్దపప్పూరు మండలం జూటూరు, తిమ్మనచెరువు ప్రాంతంలో జేసీ సోదరులకు 200 - 300 ఎకరాల వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా అస్మిత్ ఆగ్రోటెక్పేరుతో 2008లో మరికొన్ని భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
అయితే, కాలేజీ ఏర్పాటుకు ఉత్సాహంగా ఉన్న పల్లె.. ఇందుకోసం అనంతపురం రూరల్‌పరిధిలోని ఆలమూరు సమీపంలో 117.04 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేశారు. దీన్ని గత నెల 25న బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు పల్లెరఘునాథరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. సర్వే నంబరు 354, 3141,3173, 322లో ఉన్న ఈ భూమి అనంతపురానికి చెందిన కేఎం షఫీవుల్లా, కేఎం షకీల్‌షఫీ, కేఎం ఐషియా బేగం నుంచి కొనుగోలు చేశారు. పొలం విక్రయించినవారు కూడా టీడీపీ నేతలే.
ఎకరా రూ.15-20 లక్షలు
ఆలమూరు సమీపంలో ప్రధానరోడ్డుకు ఎకరా రూ.30 - 50 లక్షలు పలుకుతోంది. రోడ్డుకు దూరంగా ఉన్న పొలం ధర రూ.15 - 20 లక్షలు ఉంది. ఈ ప్రాంతంలో మంత్రి 117.04 ఎకరాలు కొన్నారు. అయితే.. ఎకరాకు దాదాపు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ. 1.72 కోట్లు చెల్లించినట్లు రిజిస్ట్రేషన్‌లో చూపారు. వాస్తవానికి విక్రయదారులకు మంత్రి చెల్లింపులు మరో రకంగా ఉన్నాయని అధికార పార్టీ నేతలతో పాటు స్థానిక రైతులు చర్చించుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం అయితే రూ.17.61 కోట్లు చెల్లించి ఉండాలి.
కాలేజీ ఏర్పాటుపై సెప్టెంబరులో స్పష్టత
వ్యవసాయ కాలేజీల కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. పల్లె, జేసీతో పాటు అనంతపురం నుంచి మరికొందరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కాలేజీల కోసం వర్సిటీకి 110 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. సెప్టెంబరు మూడోవారంలో బోర్డు మీటింగ్ జరగనుంది. అందులో దరఖాస్తులను పరిశీలిస్తారు. కాలేజీ ఏర్పాటుకు అవసరమైన పొలం, భవనాలు, ప్రొఫెసర్లు, నాన్టీచింగ్స్టాఫ్, పరిశోధనకు అనువైన వ్యవసాయక్షేత్రాలపై దరఖాస్తు దారులు పేర్కొన్న అంశాలను పరిశీలించి కాలేజీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నారు.
ఆలమూరు వద్ద మంత్రి పల్లె కొన్న భూముల వివరాలు
సర్వేనంబర్లు పొలం విస్తీర్ణం
354 16.66
3141 39.78
3173 7.60
322 53.00
-----------------------------------------
మొత్తం 117.04
-----------------------------------------