'ప్రభుత్వ సహకారంతోనే జైల్ బ్రేక్'
అమృత్సర్: నభా జైలు నుంచి ఖలిస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ మింటూతో పాటు మరో నలుగురు నేరగాళ్లు పరారైన ఘటనలో ప్రభుత్వ హస్తం ఉందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ ఆరోపించారు. హై సెక్యూరిటీ జైలులోకి గ్యాంగ్ స్టర్లు ప్రవేశించి ఉగ్రవాదిని విడిపించుకెళ్లిన తీరు.. ప్రభుత్వ భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తుందని అమరిందర్ సింగ్ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాదం వ్యాపిస్తుందని ఆయన ఆందోళన వ్యక్త చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అమరిందర్ సింగ్ విమర్శించారు. 'గ్యాంగ్ స్టర్లు ఏమాత్రం భయం లేకుండా జైలు లోకి ప్రవేశించడం.. మింటూతో పాటు మరికొందరిని విడిపించుకొని తీసుకెళ్తున్నా వారిని అడ్డుకోకపోవడం చూస్తుంటే ఉన్నత అధికారుల స్థాయిలో ముందుగా ప్లాన్ చేసి.. ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టమవుతుంది' అని ఆదివారం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరిందర్ సింగ్ ఆరోపించారు.