నగరం కాషాయమయం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాకను పురస్కరించుకుని నగరం కాషాయ మయమైంది. ప్రధాన మార్గాలు, కూడళ్లలో బీజేపీ జెండాలు, నాయకుల ఫ్లెక్సీలతో నిండిపోయింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నగర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సమాయత్త మయ్యాయి.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నగర బీజేపీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 2.30కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు సాదర స్వాగతం పలికి అటునుంచి నేరుగా బేగంపేటలోని టూరిజం గెస్ట్‌హౌస్‌కు తరలనున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో అమిత్ షాకు అభినందన సభ నిర్వహించేం దుకు నేతలు ఏర్పాట్లు చేశారు.
బలోపేతమే ప్రధాన వ్యూహం
కేంద్రంలో అధికారంలో ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలం పుంజుకోవాలన్న వ్యూహంతో బీజేపీ కదులుతోంది. కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వంపై నమ్మకం కుదరడంతో రాష్ట్రంలో పలువురు నేతలు అటు వైపే దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తొలిసారిగా నగరానికి వస్తుండటంతో గ్రేటర్ బీజేపీలో కొత్త ఊపు వచ్చింది.
త్వరలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు అమిత్ షా రాకను సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డి భావిస్తున్నారు. దేశ, నగర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్, మజ్లిస్ల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు గ్రేటర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
బీజేపీలో చేరనున్న నేతలు!
పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా భారీగా చేరికలకు నగర శాఖ గేట్లు తెరిచింది. అమిత్ షా అభినందన సభలో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు బేగంపేట కార్పొరేటర్ శంకర్ యాదవ్ (కాంగ్రెస్), బర్కత్‌పురా కార్పొరేటర్ దిడ్డి రాంబాబు (కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్), జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మామిడి లక్ష్మీబాయి భర్త మామిడి నర్సింగరావు పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం.