Comprehensive plan
-
సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు
సాక్షి, అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్), సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటెల్‌లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ (వ్యయం) యశ్చి0ద్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు హాజరయ్యారు. జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా, శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ఒక్క మరణించిన వ్యక్తి కానీ, డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చికరణ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా, నిర్భయంగా, సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈవీఎంలు, ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రో ప్లాన్‌కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. లొకేషన్ మేనేజ్మెంట్ (డిస్పాచ్ సెంటర్, రిసీట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు)కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలు కూడా కీలకమని చెప్పారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక స్వీప్ ప్రణాళిక గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యలకు కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు. సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైనా ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల సమీక్షలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, సమ్మిళిత ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భేష్ రెండు రోజుల సమీక్ష సమావేశాలకు మంచి ఏర్పాట్లు చేసి, విశిష్ట ఆతిథ్యమిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు నేతృత్వంలోని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ బృందం ధన్యవాదాలు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికలపై ఈసీఐ అధికారుల నేతృత్వంలో విజయవంతంగా జరిగిన నిర్మాణాత్మక సమీక్ష సమావేశాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు మార్గదర్శిగా నిలిచాయని కలెక్టర్ డిల్లీరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈసీఐ అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచాలి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. వారు శనివారం సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ, సెబ్ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు. దుర్గమ్మ సేవలో కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శర్మ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ప్రత్యేక అధికారి ధర్మేంద్ర శర్మ శనివారం దర్శించుకున్నారు. ధర్మేంద్ర శర్మకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. ధర్మేంద్రశర్మ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు. -
విపత్తుల్లోనూ బీమా ధీమా!
వరద నీటికి బెంగళూరులోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడం చూశాం. సంపన్నులు ఉండే ప్రాంతాలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్ల రూపాయలు పలికే ఖరీదైన విల్లాలు, కార్లు సగం మేర నీటిలో మునగడం కనిపించింది. ప్రకృతి విపత్తుల వల్ల ఆస్తులకు కలిగే నష్టాన్ని మనం అంచనా వేయలేం. కరోనా మహమ్మారి ఆరోగ్య బీమా ప్రాధాన్యతను తెలియజేసినట్టే.. బెంగళూరు వరదలు హోమ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని గుర్తు చేశాయని చెప్పుకోవాలి. కొంచెం ప్రీమియంతోనే ఇలాంటి అనుకోని ఉపద్రవాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. మోటారు బీమా థర్డ్ పార్టీ కవరేజీకే పరిమితం కాకుండా సమగ్ర కవరేజీ తీసుకోవాలి. అలాగే, హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది. వీటి గురించి వివరించే కథనం ఇది... కాంప్రహెన్సివ్... మోటారు బీమా చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. సమగ్ర కవరేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, సొంత వాహనానికి నష్టం జరిగితే పరిహారం రావాలంటే సమగ్ర కవరేజీ ఉండాల్సిందే. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలు, తుఫానుల వల్ల తమ వాహనాలకు జరిగే నష్టానికి కాంప్రహెన్సివ్ పాలసీలోనే పరిహారం లభిస్తుంది. అలాగే, వాహనం చోరీ, ప్రమాదంలో నష్టం, అగ్ని ప్రమాదం వల్ల జరిగే నష్టానికి పరిహారం కోరొచ్చు. వరదల వల్ల కార్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కారు విలువ కూడా పడిపోతుంది. ఖరీదైన రీపేర్లు అవసరం పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రిపేర్ చేసినా దెబ్బతిన్న కారు బాగు కాకపోవచ్చు. సమగ్ర కారు బీమా ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా వెనుకాడొద్దని.. ఇలాంటి ఊహించని నష్టాలను గట్టెక్కడానికి ఎంతో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాంప్రహెన్సివ్ ప్లాన్లలో మళ్లీ ఇంజన్, గేర్ బాక్స్‌కు ఎక్కువ కంపెనీలు కవరేజీ ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో విడిగా యాడాన్ కవరేజీలు తీసుకోవాల్సి వస్తుంది. ఆయా అంశాలపై నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజన్ ప్రొటెక్షన్ కవర్: కారు ఇంజన్ వాడకపోయినా పాడవుతుంది. వరద నీటి కారణంగానూ దెబ్బతింటుంది. ఇంజన్‌ను పూర్తిగా మార్చేయాలన్నా లేక ఇంజన్లో విడిభాగాలను మార్చాలన్నా అలాంటి సందర్భాల్లో ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ అక్కరకు వస్తుంది. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్: వరద నీరు కారణంగా రిపేర్ చేయడానికి వీలు లేకుండా కారు దెబ్బతింటే లేదా కారు చోరీకి గురైనా.. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ ఉన్న వారు కారు కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని (బిల్లులో ఉన్న మేర) క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. జీరో డిప్రీసియేషన్ కవర్: వాడుకలో కాలం గడిచే కొద్దీ వాహనం, అందులోని విడిభాగాల విలువ తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుల నుంచి క్లెయిమ్ వస్తే, బీమా కంపెనీలు తరిగిపోయిన విలువ మినహాయించి, మిగిలిన మేరే చెల్లిస్తాయి. కానీ, జీరో డిప్రీసియేషన్ కవర్ తీసుకుంటే ఇలాంటి కోతలు ఏవీ లేకుండా బీమా సంస్థలు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇతర కవరేజీలు: లూబ్రికెంట్లు, గేర్‌బాక్స్, ఇంజన్ ఆయిల్, గ్రీజ్ తదితర వాటికి చెల్లింపులు చేసే కన్జ్యూమబుల్ కవర్, రోడ్డు సైడ్ అసిస్టెన్స్ అందించే కవర్ కూడా అందుబాటులో ఉన్నాయి. క్లెయిమ్ దాఖలు ఎలా... వరదల వల్ల కారు కానీ, ద్విచక్ర వాహనం కానీ నీటిలో మునిగిపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా, స్టార్ట్ చేసినా కానీ, అవి ఆన్ కాకపోవచ్చు. కానీ, వాహనాన్ని కదిలించినట్టయితే మరింత నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. వాహనదారు చర్యలతో మరింత నష్టం జరిగితే బీమా సంస్థ నుంచి తిరస్కారం ఎదురుకావచ్చు. దీనికి బదులు బీమా సంస్థకు వాస్తవ సమాచారాన్ని తెలియజేయడమే మంచి నిర్ణయం అవుతుంది. తమ వాహనానికి జరిగిన నష్టాన్ని తేల్చాలని కోరొచ్చు. దాంతో బీమా సంస్థ సర్వేయర్‌ను, మెకానిక్‌ను సంఘటన స్థలానికి పంపిస్తుంది. వరదనీరు తగ్గిపోయిన తర్వాత వారు వచ్చి జరిగిన నష్టంపై అంచనాకు వస్తారు. లేదంటే వాహనాన్ని సమీపంలోని వర్క్‌షాప్‌కు తరలిస్తారు. అనంతరం ఇంజన్‌ను తనిఖీ చేయడం, ఇంజన్ ఫ్లషింగ్, క్లీనింగ్ చేయించొచ్చు. ఇంజన్‌కు జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే నష్టాన్ని వాహనదారుడే మోయాల్సి వస్తుంది. అందుకనే వరద నీటిలో చిక్కుకున్న వాహనాన్ని స్టార్ట్ చేయడానికి బదులు టోయింగ్ వ్యాన్‌తో తరలించి, నష్టాన్ని మదింపు చేయించడమే సరైనది అవుతుంది. బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో జాప్యం లేకుండా జాగ్రత్తపడాలి. బెంగళూరులో వరదల వల్ల వస్తున్న క్లెయిమ్‌లలో 80 శాతం విడిభాగాలకు నష్టానికి సంబంధించినవి అయితే, మరో 20 శాతం పూర్తి డ్యామేజీ క్లెయిమ్‌లు ఉంటున్నట్టు బీమా సంస్థలు తెలిపాయి. హోమ్ ఇన్సూరెన్స్ సంగతేంటి? సొంతిల్లు పట్ల ఎంతో మమకారం ఉంటుంది. ఈ రోజుల్లో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తే కానీ సొంతిల్లు సమకూరడం లేదు. అంతటి విలువైన ఇంటికి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ముంబై, చెన్నై, ఇప్పుడు బెంగళూరు నగరాలు వరద ముప్పును ఏ స్థాయిలో ఎదుర్కొన్నదీ చూశాం. కనుక విలువైన ఇంటికి, ఇంట్లోని విలువైన సామగ్రికి బీమా రక్షణ తీసుకోవడం ఎంతో లాభం. ఇంటి యజమానులే అని కాదు, అద్దెకు ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అద్దెకు ఉండే వారు ఇంట్లోని వాటికి మాత్రమే కవరేజీ తీసుకుంటే చాలు. అదే ఇంటి యజమాని అన్ని రకాల కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా తాము నివసిస్తున్న ప్రాంతానికి ఉండే రిస్క్‌ల గురించి పూర్తి అవగాహనతో ఉంటే, ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తేల్చుకోవచ్చు. ప్రకృతి విపత్తులు (అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం) లేదా ప్రమాదవశాత్తూ వాటిల్లిన నష్టాలకు సైతం కవరేజీ లభిస్తుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వారికే ఇది అవసరం అనుకోవద్దు. ఎత్తయిన అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో ఉండేవారికీ హోమ్ ఇన్సూరెన్స్ ఎన్నో రూపాల్లో ఆదుకుంటుంది. ఇంటి విలువ, ఇంట్లోని వస్తువువల విలువ ఆధారంగానే ప్రీమియం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. ప్రయోజనాలు.. హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఇంటి నిర్మాణానికి వాటిల్లే నష్టానికే పరిహారం అనుకోకండి. గ్యారేజ్, కాంపౌండ్, ఫెన్సింగ్‌కు నష్టం ఎదురైనా కవరేజీ లభిస్తుంది. బేస్ పాలసీలకి యాడాన్‌గా, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఇంట్లోని ఆభరణాలు, నగదుకు కూడా రక్షణనిచ్చే కవరేజీలు ఉన్నాయి. లేదంటే సమగ్ర బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల ఏ రూపంలో దేనికి నష్టం వాటిల్లినా పరిహారం అందుతుంది. ఇంట్లోని వస్తువులకు నష్టం జరిగితే, వాటి రీపేర్‌కు అయ్యేంత కాకుండా.. వాస్తవ విలువ మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా బీమా రక్షణ కల్పించుకోవడం ద్వారా భూకంపాలు, వరదల వంటి భారీ నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో దొంగలు పడి విలువైన సొత్తు ఎత్తుకుపోయినా, ఈ ప్లాన్‌లో కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అందుబాటులోనే ఉంటుంది. రూ.2,000 ప్రీమియంకే కవరేజీనిచ్చే ప్లాన్లు కూడా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, దోపిడీల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల్లోని వారు భారీగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడదు. పైగా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీ ఇంటి కారణంగా ఎదురయ్యే న్యాయ వివాదాల్లోనూ రక్షణనిస్తుంది. ఎలా అంటే.. ఇంట్లో పనిచేసే వారు మరణించినా పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. అగ్ని ప్రమాదాల వల్ల ఇతర ప్రాపర్టీకి నష్టానికి కారణమైనా, అతిథులు కానీ, ఇతర వ్యక్తుల మరణానికి దారితీసినా కవరేజీ లభిస్తుంది. ఇవి గుర్తుంచుకోండి.. ► హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఇంట్లో ఉన్న అన్నింటికీ ఆధారాలు ఉంచుకోవాలి. లేదంటే క్లెయిమ్ సమయంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ► అనధికారిక కట్టడం అయితే బీమా కవరేజీ ల భించదు. చట్టబద్ధమైన నిర్మాణాలు, చట్టపరమై న అనుమతులు ఉన్న వాటికే కవరేజీ లభిస్తుంది. ► ఇంట్లో అద్దెకు ఉండే వారు, తమ నివాసంలోని విలువైన అన్ని ఉత్పత్తులకు కవరేజీ తీసుకోవచ్చు. ► వరదల సమయంలో ఇంట్లోని ఎలక్ట్రిక్ ఉత్పత్తులన్నింటికీ కరెంట్ కరెక్షన్ తొలగించాలి (అన్ ప్లగ్ చేయాలి). ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను కూడా తొలగించాలి. ► వరద ముప్పు నుంచి తప్పించుకోవడానికి తమ వంతు ముందు జాగ్రత్తలూ తీసుకోవచ్చు. నిర్మా ణ సమయంలోనే ఇంటి బేస్మెంట్ను రోడ్డు నుంచి వీలైన మేర ఎత్తున నిర్మించుకోవాలి. ► సీవరేజీ పైపులకు చెక్ వాల్వులు ఏర్పాటు చేసుకోవాలి. వరదల సమయంలో బయటి నీరు సీవరేజీ పైపుల నుంచి మీ ఇంటిని ముంచెత్తకుండా చెక్‌వాల్వ్‌లు సాయపడతాయి. ► వరద నీరు ఇంట్లోకి చేరుతుందని గుర్తించిన వెంటనే విలువైన వస్తువులను ఎత్తయిన ప్రదేశానికి చేర్చాలి. లేదంటే దిగువ అంతస్తుల్లోని వారు ఎగువ అంతుస్తులోని వారి సాయం కోరి పై అంతస్తులకు తరలించాలి. ► ముఖ్యంగా కీలకమైన డాక్యుమెంట్లను, నగలను ముందుగా తీసేసి జాగ్రత్త పరుచుకోవాలి. ► కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిర్మాణం చేసుకున్న వారు మేడపైకి వాటిని తరలించొచ్చు. వరద నీరు మరింత పైకి చేరుతుందని తెలిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి. ► వరద హెచ్చరిక వచ్చిన వెంటనే అమలు చేసే విధంగా ముందస్తు కార్యాచరణ దగ్గర ఉంచుకోవాలి. -
మూడు జిల్లాల్లో ‘కృషి సించయ్ యోజన’
మంత్రి హరీశ్‌రావు సూచన సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘కృషి సించయ్ యోజన’ను రాష్ర్టం లో అమలు చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులతో శనివారం జలసౌధలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో దేశవ్యాప్తంగా నీటి పారుదల రంగం అభివృద్ధికి కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. గతంలో కేంద్ర నీటి పారుదల శాఖ అమలు చేస్తున్న ఏఐబీపీ తదితర పథకాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కృషి సించయ్ యోజన ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది తెలంగాణలో నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎంపిక చేసిన జిల్లాల నుంచి అందే ప్రతిపాదనలను ముఖ్య కార్యదర్శి ద్వారా కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ఏఐబీపీ పథకం కింద గతంలో ప్రతిపాదించిన పథకాల్లో ఆమోదం పొంది పూర్తయిన ప్రాజెక్టుల నివేదికలను కూడా పంపాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 2014-15లో రూ.59.5 కోట్లు, 2015-16లో రూ.112.2 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఢిల్లీ వెళ్లి ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ నీటి పారుదల విభాగం సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కే.జోషి, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.