మూడు జిల్లాల్లో ‘కృషి సించయ్ యోజన’
మంత్రి హరీశ్‌రావు సూచన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘కృషి సించయ్ యోజన’ను రాష్ర్టం లో అమలు చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులతో శనివారం జలసౌధలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో దేశవ్యాప్తంగా నీటి పారుదల రంగం అభివృద్ధికి కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు.
గతంలో కేంద్ర నీటి పారుదల శాఖ అమలు చేస్తున్న ఏఐబీపీ తదితర పథకాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కృషి సించయ్ యోజన ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది తెలంగాణలో నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎంపిక చేసిన జిల్లాల నుంచి అందే ప్రతిపాదనలను ముఖ్య కార్యదర్శి ద్వారా కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ఏఐబీపీ పథకం కింద గతంలో ప్రతిపాదించిన పథకాల్లో ఆమోదం పొంది పూర్తయిన ప్రాజెక్టుల నివేదికలను కూడా పంపాలని సూచించారు.
దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 2014-15లో రూ.59.5 కోట్లు, 2015-16లో రూ.112.2 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఢిల్లీ వెళ్లి ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ నీటి పారుదల విభాగం సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కే.జోషి, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.